హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): అప్పులుచేసి కాలేజీలను నడుపుతున్నామని, ప్రజాప్రభుత్వంలోనూ తమకు నిరాశే మిగిలిందని ప్రైవేట్ కాలేజీల యాజమాన్య సంఘాలు ఆవేదన వ్యక్తంచేశాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని సంఘాలు ఆరోపించాయి. పలుమార్లు మంత్రులను కలిసి వినతిపత్రాలిచ్చినా.. సాక్షాత్తు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసినా ప్రయోజనం లేకుండా పోయిందని, కాలేజీ యాజమాన్యాలను ప్రభుత్వం పూర్తిగా చిన్న చూపు చూస్తున్నదని మండిపడ్డాయి. త్వరలోనే అన్ని కాలేజీలు జేఏసీగా ఏర్పడి బకాయిల విడుదల పోరాటాన్ని మరింత ఉధృతం చేయనున్నాయి. మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో కాలేజీ యాజమాన్యాల ప్రతినిధులు మాట్లాడుతూ.. దసరా కానుకకైనా రూ.6,500 కోట్లల్లో టోకెన్లు జారీ అయిన రూ.1,200 కోట్ల బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.