హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ప్రజలకు పోలీసులు అందుబాటులో ఉండేలా విజిబుల్ పోలీసింగ్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని డీజీపీ సీవీ ఆనంద్ కోరారు. శుక్రవారం డీజీపీ కార్యాలయంలో రాష్ట్రంలోని అన్ని యూనిట్ల అధికారులు, ఎస్‌హెచ్‌వోలతో ఆయన సమీక్షించారు. పోలీస్స్టేషన్లలో విజిటింగ్ అవర్స్ తప్పనిసరిగా అమలు చేయాలని, క్యాంప్ ఆఫీస్ విధానానికి బదులుగా అధికారులు కార్యాలయాల్లోనే అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని సూచించారు. కొంతమంది పోలీస్ అధికారుల పనితీరుపై ఫిర్యాదులు వస్తున్నాయని, ఇకపై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు. భూవివాదాల వంటి సివిల్ వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోరాదని స్పష్టం చేశారు. ప్రతి ఎఫ్ఐఆర్కూ సంబంధించిన ఆధారాలను ఈ-సాక్ష్యం పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని చెప్పారు. ఈ విషయంలో ఆదిలాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు ముందంజలో ఉన్నాయని ప్రశంసించారు. అరైవ్ అలైవ్‌తో రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గినట్టుగా డీజీపీ పేరొన్నారు.