పర్వతగిరి, నవంబర్ 4 : గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కారణంగా ఓ విద్యార్థిని నాలుగు నెలలుగా చదువుకు దూరమైంది. గురుకులంలో తనకు పాము కాటు వేసిందని చెప్పడంతో పాఠశాల నుంచి గెంటేసినట్టు విద్యార్థినితోపాటు ఆమె తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం జూన్లో వడ్లకొండ గ్రామానికి చెందిన వల్లందాసు స్వప్న, నాగరాజు దంపతుల కూతురు శివాని 5వ తరగతిలో చేరింది. గత జూలై నెలలో ఓ ఉపాధ్యాయురాలు పాఠశాల ఆవరణలో గడ్డి తొలగించాలని ఆదేశించడంతో విద్యార్థినులు ఆ పనిలో ఉన్నారు.
ఈ క్రమంలో శివాని పాముకాటుకు గురై కేకలు వేయడంతో ఉపాధ్యాయులు పర్వతగిరిలోని నాటు వైద్యుడి వద్దకు తీసుకువెళ్లి నామమాత్రంగా చికిత్స చేయించారు. ఆ తరువాత తల్లిదండ్రులకు సమాచారం అందించారు. నాటు వైద్యాన్ని నమ్మని తల్లిదండ్రులు వరంగల్ ఎంజీఎం దవాఖానకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఆ కోపంతో గురుకులం పరువు తీశారంటూ శివానిని పాఠశాల నుంచి పంపించారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. తమ కూతురు గురుకులంలో చదువుకునేలా చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్, డీఈవోను కోరుతున్నారు.
హాస్టల్ నుంచి వెళ్లగొట్టలేదు: ప్రిన్సిపాల్
శివాని గురుకులంలో విచిత్రంగా ప్రవర్తిస్తున్నదని, ఫలితంగా తోటి విద్యార్థినులు భయాందోళనకు గురవుతున్నారని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ అపర్ణ తెలిపారు. పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఆమెకు పాము కరవలేదని, కావాలనే రాద్ధాంతం చేస్తున్నట్టు తెలిపారు. శివాని పెన్నుతో గుచ్చుకొని కోతి కరిచిందని తోటి విద్యార్థుల్లో అపోహలు సృష్టించేలా చిలిపి చేష్టలు చేస్తున్నదని చెప్పారు. శివానిలో మార్పు వస్తే ఇప్పటికైనా గురుకులంలో చేర్చుకోవడానికి తాము సిద్ధమేనని ఆమె స్పష్టంచేశారు.