హైదరాబాద్, అక్టోబర్15 (నమస్తే తెలంగాణ): సత్వర సాగునీటి ప్రాయోజిత కార్యక్రమం(ఏఐబీపీ) కింద కొనసాగుతున్న ప్రాజెక్టుల పురోగతిపై ఈ నెల 29న ప్రగతి సమావేశంలో ప్రధాని మోదీ సమీక్షించనున్నారు. కేంద్ర జల్‌శక్తిశాఖ ఇప్పటికే రాష్ర్టాలకు సమాచారం అందించింది. ఏఐబీపీ కింద తెలంగాణలో దేవాదుల, వరద కాలువ పనులకు కేంద్రం ఆర్థిక సాయం అందిస్తున్నది. 2027నాటికి ఆయా ప్రాజెక్టులను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే 29న ప్రధాని మోదీ నేతృత్వంలో కొనసాగనున్న ప్రగతి సమావేశంలో ఈ రెండు ప్రాజెక్టుల పురోగతిపై చర్చించనున్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై కూడా ప్రగతి మీటింగ్‌లో సమీక్షించనున్నారు. ఇదిలాఉంటే గతంలో ఇప్పటికే మూడుసార్లు ప్రగతి సమావేశం ఎజెండాలో పోలవరంపై చర్చ ఉంటుందని చెప్పినా చివరి నిమిషంలో ఎజెండా నుంచి తొలగించడం గమనార్హం.