జ్యోతినగర్, జూలై 30: దేశంలోనే తొలిసారిగా పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ రిజర్వాయర్‌పై నిర్మించిన 100 మెగావాట్ల ఫ్ల్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను శనివారం ప్రధాని నరేంద్రమోదీ జాతికి అంకితమిచ్చారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఢిల్లీలో ‘ఉజ్వల్ భారత్, ఉజ్వల భవిష్యత్’ పేరిట చేపట్టిన విద్యుత్తు మహోత్సవాల ముగింపు కార్యక్రమం సందర్భంగా ప్రధాని రామగుండం ప్లాంట్‌తోపాటు కేరళలోని కాయంకుళంలో నిర్మించిన 92 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రూప్‌టాప్ సోలార్ ప్లాంట్లకు సంబంధించిన నేషనల్ పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతకుముందు పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో దేశం సాధించిన విజయాలను ప్రదర్శించారు. కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని ఎన్టీసీసీలోని కాకతీయ ఫంక్షన్హాల్లో కలెక్టర్ సంగీతాసత్యనారాయణ, ఎన్టీపీసీ సీజీఎం సునీల్‌కుమార్, జీఎంలు ప్రసెన్జిత్ పాల్, పీకే లాడ్, అనిల్‌కుమార్ తదితరులు వీక్షించారు.