వరంగల్, జూలై 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కాజీపేట: దేశాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం అందిస్తున్న సహకారం గొప్పదని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకోవడంలో తెలంగాణది కీలకపాత్ర అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు కేంద్రంగా ఉన్నదని చెప్పారు. ప్రధాని మోదీ శనివారం వరంగల్ నగర పర్యటనలో భాగంగా రూ.521 కోట్లతో కాజీపేటలో నిర్మించనున్న రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.2,147 కోట్లతో చేపట్టనున్న జగిత్యాల-కరీంనగర్-వరంగల్, రూ.3,441 కోట్లతో చేపట్టనున్న మంచిర్యాల-వరంగల్ జాతీయ రహదారుల విస్తరణ పనులను ప్రారంభించారు.
అనంతరం హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించిన బీజేపీ విజయ్‌సంకల్ప సభలో ప్రధాని మాట్లాడుతూ.. భారతీయ రైల్వేలో కాజీపేట ఇప్పుడు గర్వించదగిన భాగస్వామిగా మారిందని పేర్కొన్నారు. రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నెలకు 200 వ్యాగన్లను ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. వరంగల్‌కు టెక్స్టైల్ పార్కును ఇచ్చామని, తొమ్మిదేండ్లలో తెలంగాణలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, మెరుగైన అనుసంధానంపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. ప్రపంచానికి సవాలుగా మారిన కరోనాకు వ్యాక్సిన్‌ను తెలంగాణలోనే తయారుచేశారని ప్రశంసించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడు తూ.. కాజీపేటలో 160 ఎకరాల్లో రూ.521 కోట్లతో రైల్వే వ్యాగన్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను చేపట్టనున్నట్టు తెలిపారు.
భద్రకాళిని దర్శించుకున్న మోదీ
ప్రధాని మోదీ భద్రకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు ప్రధానికి మంగళవాయిద్యాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు.