హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ఈ నెల 8న రాష్ర్టానికి రానున్న ప్రధాని నరేంద్ర మోదీ వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతారని కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. ముందుగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం రూ.715 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారని, సికింద్రాబాద్ -మహబూబ్‌నగర్ నడుమ రూ.1,410 కోట్లతో పూర్తిచేసిన 85 కిలోమీటర్ల డబ్లింగ్ రైల్వేలైన్‌ను జాతికి అంకితం చేస్తారని, ఎంఎంటీఎస్ ఫేజ్-2లో భాగంగా 13 కొత్త సర్వీసులను ప్రారంభిస్తారని తెలిపారు.
పరేడ్‌గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన బహిరంగసభలో ప్రధాని పాల్గొని రూ.7,864 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 6 జాతీయ రహదారులకు, రూ.1,366 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్‌లో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేస్తారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ తన పర్యటనలో రూ.11,355 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు.