ఆదిలాబాద్, మార్చి 4(నమస్తే తెలంగాణ): తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తున్నదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ సోమవారం జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రూ.56 వేల కోట్ల విలువ చేసే పనులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దేశానికి సంబంధించిన ప్రాజెక్టులను ఆదిలాబాద్‌లో ప్రారంభించామని, వీటిలో 30 ప్రాజెక్టులకు సంబంధించిన అభివృద్ధి పనులను జాతికి అంకితం చేశామని తెలిపారు. వీటిలో విద్యుత్తు, పర్యావరణ, రహదారులకు సంబంధించినవి ఉన్నాయని పేర్కొన్నారు. గత పదేండ్లలో రాష్ట్ర ప్రగతికి కేంద్రం వేల కోట్ల రూపాయలను విడుదల చేసిందని చెప్పారు. నాలుగు వేల మెగావాట్ల విద్యుత్తు ప్రాజెక్టును రామగుండంలోని ఎన్టీపీసీలో ఏర్పాటు చేశారని, ఇందులో నిరుడు 800 మెగావాట్ల మొదటి యూనిట్ అందుబాటులోకి వచ్చిందని, సోమవారం మరో 800 మెగావాట్ల రెండో యూనిట్‌ను జాతికి అంకితం చేశామని తెలిపారు.
జ్యోతినగర్ : తెలంగాణ అవసరాల కోసం పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో నిర్మించిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ప్లాంటులో 800 మెగావాట్ల రెండో యూనిట్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు కేటాయించిన థర్మల్ విద్యుదుత్పత్తిలో ఫేస్-1 కింద ఎన్టీపీసీలో నిర్మించిన 1600 మెగావాట్ల ప్రాజెక్టులో నిరుడు 800 మెగావాట్ల మొదటి యూనిట్ ఉత్పత్తిని ప్రారంభించింది. తాజా గా, మరో 800 మెగావాట్ల రెండో యూనిట్‌ను ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. ఈ వేడుకను తిలకించేందుకు ఎన్టీపీసీ యాజమాన్యం టౌన్‌షిప్‌లోని కాకతీయ ఫంక్షన్ హాల్లో ఎల్ఈడీ స్క్రీన్‌ను ఏర్పాటు చేయగా, ఉద్యోగులు ఉన్నతాధికారులు, ఎన్టీపీసీ కార్మిక సంఘాల నాయకులు తిలకించారు.
కాగా, దక్షణ భారత దేశంలోనే మొదటిసారిగా అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఈ రెండు సూపర్ క్రిటికల్ యూనిట్లను 1600 (800×2) రూ.10,599 కోట్ల వ్యయంతో నిర్మించారు. విభజన చట్టంలోని ఫేజ్-2 కింద చేపట్టనున్న 2400 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు యూనిట్లను కూడా స్థానికంగానే రూ.26,952 కోట్ల అంచనా వయ్యంతో నిర్మించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటీవలే ప్రాజెక్టు కోసం మట్టి నమూనా పరీక్షలు జరిగాయి. ప్రాజెక్టుకు కావాల్సిన పర్యావరణ అనుమతులు, భూసేకరణ, ఇతర పనులపై బ్లూప్రింట్ కూడా సిద్ధం చేశారు. పనులు ముందుకు సాగడం కోసం ప్రధానంగా విద్యుత్తు కొనుగోలుపై ప్రభుత్వాలతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్(పీపీఏ) జరగాల్సి ఉన్నది.
తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెదన్నలా సహాయ, సహకారాలు అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానికి నాలుగు కోట్ల మంది ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నట్టు తెలిపారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు మాట్లాడుతామని అన్నారు. హైదరాబాద్ మెట్రో, మూసీనది అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు. హైదరాబాద్‌లో స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ అనుమతులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, ప్రభుత్వ ప్రధాన కార్యాదర్శి శాంతికుమారి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొన్నారు.