KTR | మణిపూర్, లక్షద్వీప్ కంటే లగచర్ల ఘటన చిన్నదేమీ కాదని.. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు డిమాండ్ చేశారు. లగచర్ల బాధితులతో కలిసి ఆయన జాతీయ మానవహక్కుల సంఘాన్ని కలిశారు. అనంతరం బాధితులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణలో ఏం జరుగుతుందో దేశానికి తెలియాలని.. పేద గిరిజనుల భూములను రేవంత్ సర్కార్ బలవంతంగా గుంజుకుంటోందని కేటీఆర్ ఆరోపించారు. అర్ధరాత్రి పోలీసులు, ప్రైవేటు వ్యక్తులతో కలిసి దళిత రైతుల ఇళ్లపై దౌర్జన్యకాండ జరుగుతుందని.. సీఎం బ్రదర్ గిరిజన రైతులపై దాడి చేసినా కేసులుండవని విమర్శించారు. ప్రజాప్రతినిధి కాకున్నా సీఎం సోదరుడికి కలెక్టర్ స్వాగతం పలుకుతున్నారన్నారు. రాజ్యాంగ రక్షకులమంటున్న రాహుల్ సీఎం నియోజకవర్గంలో దమనకాండ స్పందించాలన్నారు. లగచర్లలో అర్ధరాత్రి మహిళలపై పోలీసుల దాడి చేశారని.. గిరిజన రైతులపై అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారన్నారు.
లగచర్ల ఘటనపై ప్రధాని మోదీ, రాహుల్, ఖర్గే ఎందుకు స్పందించరు? అంటూ ప్రశ్నించారు. మణిపూర్, లక్షద్వీప్ కంటే లగచర్ల ఘటన చిన్నదేమీ కాదని.. సీఎం సోదరుడి కంపెనీ కోసమే ఇంతమంది గిరిజనులు బాధపెడుతున్నరని ఆరోపించారు. తెలంగాణలో ఏం జరుగుతుందో తెలియనట్లు బీజేపీ నాటకాలు ఆడుతుందని.. సీఎం నియోజకవర్గంలో జరుగుతున్న దమనకాండపై స్పందించాలని డిమాండ్ చేశారు. పేద గిరిజనుల బాధ రాహుల్‌గాంధీకి కనిపిస్తలేదా?.. లగచర్లపై అర్ధరాత్రి దమనకొండ బీజేపీకి కనబడడం లేదా? అంటూ నిలదీశారు. కొడంగల్‌లో 3వేల ఎకరాల్లో ఫార్మా విలేజీ కోసం సీఎం నిర్ణయించారని.. రైతులకు నోటీసులు ఇచ్చి.. వాటిని తిరస్కరించిన వారిని బెదిరిస్తున్నారన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం గడువు ముగిసింది.. రాహుల్ ఇప్పటికైనా స్పందించాలని.. రైతులతో చర్చలు జరిపేందుకు ఎవరూ ముందుకురావడం లేదన్నారు. ఫార్మా సిటీ కోసం మా హయాంలో 14వేల ఎకరాల భూమిని సేకరిస్తున్నారని.. తమ హయాంలో ఆ రైతులందరినీ ఒప్పించి భూములను సేకరించామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపితే అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో తెలంగాణ ప్రజలను మోసం చేసిందని.. మా బీఆర్ఎస్ నేతలందరూ జాతీయ మానవహక్కుల, మహిళా హక్కుల కమిషన్‌ను కలిశారన్నారు. ఎస్టీ హక్కుల కమిషన్ సైతం కలిసి లగచర్ల దమనకాండ వివరించారన్నారు. సీఎం నియోజకవర్గంలో తొమ్మిది నెలలుగా గొడవలు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఎకరానికి రూ.60-రూ.70లక్షల విలువైన భూమికి రూ.10లక్షలు ఇస్తామంటున్నారని.. లగచర్ల అర్ధరాత్రి మహిళలనీ చూడకుండా దాడులు చేశారన్నారన్నారు. గిరిజన రైతులను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారని.. మణిపూర్ గురించి మాట్లాడే రాహుల్ గాంధీ కొడంగల్ దమనకాండపై ఎందుకు మాట్లాడరు ? మండిపడ్డారు. రాహుల్ గాంధీ, ప్రధాని నరేంద్ర మోదీ సైతం స్పందించాలని డిమాండ్ చేశారు.
రాజ్యసభలో ఈ విషయం లేవనెత్తుతాం.. పార్లమెంట్‌లోనూ ఈ విషయం మాట్లాడాలని కోరుతామన్నారు. లగచర్ల బాధితుల తరఫున ఢిల్లీకి బీఆర్ఎస్ శ్రేణులందరికీ ధన్యవాదులు చెబుతున్నానన్నారు. న్యాల్కల్తో పాటు పలుచోట్ల భూముల విషయంలో ప్రజలు నిరసనలు తెలుపుతున్నారని.. కందుకూరు, యాచారంలో పర్యటించి రైతుల్లో కాంగ్రెస్ నేతల్లో విషం నింపారన్నారు. అదే 14వేల ఎకరాల్లో ఫోర్త్‌సిటీ, ఫార్మా విలేజీలను ఏర్పాటు చేస్తున్నారని, భూములు ఇవ్వకపోతే తొక్కుతామని సీఎం సోదరుడు అంటున్నాడని మండిపడ్డారు. కొడంగల్ నియోజకవర్గంలో ఇంత ఆందోళన జరిగితే రేవంత్ మహారాష్ట్రలో ప్రచారం చేస్తారా? అంటూ ధ్వజమెత్తారు. ఢిల్లీకి మూటలు పంపుతున్నందుకు రేవంత్ ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఉద్దేశం మాకు లేదన్నారు. కాంగ్రెస్ ఐదేళ్లు ఉంటే మేం పదేళ్లు అధికారంలో ఉంటామన్నారు.