హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టీ ప్రభాకర్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. తాను 65 ఏండ్ల సీనియర్ సిటిజన్నని, తన వయసుతోపాటు అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. తాను ఎకడికి పారిపోలేదని, వైద్యం కోసమే అమెరికాకు వెళ్లానని, ఇదే విషయాన్ని గతంలో కింది కోర్టుకు తెలిపానని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు తనను ప్రధాన నిందితుడిగా చేర్చారని, నిజానికి ఆ వ్యవహారంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని, అయినప్పటికీ కొందరి నేరాంగీకార వాంగ్మూలాల ఆధారంగా తనపై తప్పుడు కేసు నమోదు చేశారని చెప్పారు.
ఈ కేసులో అరెస్ట్ కాకుండా త ప్పించుకునేందుకే తాను విదేశానికి పారిపోయినట్టు దర్యాప్తు సంస్థ కింది కోర్టుకు చెప్పి నాన్-బెయిలబుల్ వారెంట్ ఉత్తర్వులు పొందిందని వివరించారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, ఎస్ఐబీ చీఫ్‌గా నిబంధనలకు లోబడి నిబద్ధతతో పనిచేశానని తెలిపారు. అధికారిక పార్టీతో కుమ్మకై ఇతర పార్టీల నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించానన్నది అసత్యమని, అది తప్పుడు ఆరోపణ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను అమెరికాలో ఉన్నప్పటికీ దర్యాప్తు అధికారితో సంప్రదిస్తూనే ఉన్నానని, తన వివరాలన్నీ దర్యాప్తు అధికారికి అందజేశానని చెప్పారు.
తాను అమెరికా వెళ్లాక దర్యాప్తు అధికారులు తన నివాసంలో సోదాలు జరిపినప్పటికీ వారికి ఎలాంటి ఆధారాలు లభించలేదని, తాను తప్పు చేసినట్టు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఇప్పటికే పూర్తవడంతో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారని, ఆ రికార్డుల్లోని విషయాలు తప్ప కొత్తగా సేకరించాల్సిన అంశాలేమీ లేవని, అయినప్పటికీ దర్యాప్తునకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పోలీసులు తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనున్నది.