హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): నిన్నటిమొన్నటి మార్కెట్లలో కిలో రూ.50 పలికిన ఉల్లి ధర క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. గతనెలలో హోల్సేల్ మారెట్లో కిలో ఉల్లిగడ్డలు రూ.40 నుంచి రూ.50 వరకు విక్రయాలు జరిగాయి. యాసంగి కొత్తపంట మారెట్లకు వస్తుండటంతో ధరలు తగ్గుతున్నాయి. ప్రస్తుతం కిలో ఉల్లిగడ్డ రూ.15 నుంచి రూ.20 వరకు విక్రయాలు జరుపుతున్నారు. ఈనెలాఖరుకు ధరలు మరింత తగ్గే అవకాశం ఉన్నదని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. నగరంలోని హోల్సేల్ మారెట్లకు రోజుకు 15వేల నుంచి 18వేల క్వింటాళ్లు ఉల్లిగడ్డలు వస్తున్నట్టు మార్కెటింగ్ అధికారులు పేర్కొంటున్నారు. మరోవైపు ఉల్లిపై 20% ఎక్స్పోర్ట్ ట్యాక్స్ ఎత్తివేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీని కారణంగానూ ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయని అధికారులు తెలుపుతున్నారు.