మహబూబ్నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లా సాహితీమూర్తులకు ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. ప్రస్తుతం తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా ఉన్న ఆచార్య ఎల్లూరి శివారెడ్డికి, ప్రధాన కార్యదర్శిగా ఉన్న డాక్టర్ జుర్రు చెన్నయ్యకు శాంతా బయోటెక్ అధినేత డాక్టర్ కే.ఐ.వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలోని శాంతా వసంత చారిటబుల్ ట్రస్ట్ పురస్కారాలను ప్రకటించింది.
ప్రముఖ పారిశ్రామికవేత్త, కళా, సాహిత్యరంగం అంటే అమితంగా ఇష్టపడే పద్మభూషణ్, శాంతా బయోటెక్స్ అధిపతి వరప్రసాద్ రెడ్డి ఈ పురస్కారాలు అందజేస్తారు. ఆచార్య ఎల్లూరి శివారెడ్డికి వరప్రసాద్ రెడ్డి ఉత్తమ సాహితీవేత్త పురస్కారాన్ని, డాక్టర్ జుర్రు చెన్నయ్యకు తెలుగు భాషా సేవారత్న పురస్కారాన్ని ఈ నెల 18వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ నగరంలోని ఆబిడ్స్ లో ఉన్న తెలంగాణ సారస్వత పరిషత్తు ఆడిటోరియంలో ప్రదానం చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖామంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. పురస్కార గ్రహీతలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల నగదు, జ్ఞాపిక, శాలువా, ప్రశంసాపత్రం అందజేసి సత్కరిస్తారు.
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి కొల్లాపూర్ ప్రాంతంలోని కాలూరులో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆచార్యులుగా, శాఖ అధ్యక్షులుగా, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా, కవిగా, విమర్శకుడిగా, పరిశోధకులుగా, అవిరళ సేవలందించారు.
ప్రస్తుతం తెలంగాణ సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా విశిష్టమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. మహాభారతంలో రసపోషణము, సురవరం ప్రతాపరెడ్డి జీవితం సాహిత్యము, రసరేఖలు, పూలకారు వంటి అనేక గ్రంథాలు రచించారు. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాకరమైన దాశరథి పురస్కారాన్ని స్వీకరించారు.
తెలుగుభాషా సేవారత్న పురస్కారం అందుకుంటున్న డా. చెన్నయ్య జడ్చర్ల మండలం కావేరమ్మ పేట వాస్తవ్యులు. ‘తెలుగు దినపత్రికలు భాషా సాహిత్య స్వరూపం’ అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. ప్రముఖ తెలుగు దినపత్రికలో 10 సంవత్సరాల పాటు పాత్రికేయునిగా పనిచేశారు.
తెలుగు విశ్వవిద్యాలయంలో ఇరవైఆరు సంవత్సరాలకు పైగా ప్రజా సంబంధాల అధికారిగా పని చేశారు. ఆకాశవాణిలో సుమారు 30 ఏళ్లుగా క్యాజువల్ పద్ధతిలో న్యూస్ రీడర్ గా, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ వంటి ప్రముఖుల ప్రసంగాల అనువాదకుడిగా అందుకున్నారు. అనువాదాలు, మౌలిక రచనలు కలిపి 15 గ్రంథాలు వెలువరించారు.
ఉత్తమ ప్రజాసంబంధాల అధికారిగా, ఉత్తమ అనువాదకుడిగా, ఉత్తమ న్యూస్ రీడర్ గా అనేక పురస్కారాలు అందుకున్నారు. సిలికానాంధ్ర అంతర్జాతీయ సంస్థకు భారతదేశ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షునిగా సేవలందించారు.
ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, డాక్టర్ జుర్రు చెన్నయ్యకు పురస్కారాలు లభించడం పట్ల పాలమూరు జిల్లా కవులు కోట్ల వెంకటేశ్వరరెడ్డి, డా. భీంపల్లి శ్రీకాంత్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
జయశంకర్ జిల్లాలో పెద్దపులి కలకలం.. పెండ్లి బృందం వాహనం వెంట పరుగులు
Miss Universe | భారత్ నుంచి మిస్ యూనివర్స్ కిరీటం పొందింది ఈ ముగ్గురే..
Telangana | తమిళనాడు బయల్దేరిన సీఎం కేసీఆర్