RRR | హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ కోసం రైతులను ఎలాగైనా ఒప్పించాలని సీఎం రేవంత్రెడ్డి గత నెలలో కలెక్టర్లను ఆదేశిస్తే.. వచ్చే నెల రెండో వారం చివరినాటికి ఈ భూసేకరణ ప్రక్రియను పూర్తిచేయాలని తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గడువు విధించారు. కానీ, ఆ భూములకు మార్కెట్లో ఉన్న ధరలకు, ప్రభుత్వం ఇవ్వజూపుతున్న ధరలకు ఏ మాత్రం పొంతన లేకపోవడం పెద్ద అడ్డంకిగా మారింది. ట్రిపుల్ఆర్ను నిర్మించతలపెట్టిన ప్రాంతాల్లో ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో ఎకరం ధర రూ.50 లక్షల వరకు పలుకుతుంటే.. రైతులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) రూ.6 లక్షలు మాత్రమే ఆఫర్ చేస్తున్నది. దీంతో భూములను ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తుండటంతో కలెక్టర్లు ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొన్నది. మొత్తం 348 కి.మీ. పొడవున నిర్మించతలపెట్టిన ట్రిపుల్ఆర్ కోసం దాదాపు 10 వేల ఎకరాల భూములను సేకరించాల్సి ఉన్నది. ఇందులో 158.65 కి.మీ. పొడవైన ఉత్తర భాగం నిర్మాణానికి 4,600 ఎకరాలు, 189.02 కి.మీ పొడవైన దక్షిణ భాగం నిర్మాణానికి 5,400 ఎకరాలు అవసరమవుతాయి.
ట్రిపుల్ఆర్ నిర్మాణానికి అయ్యే ఖర్చు పూర్తిగా కేంద్రమే భరించనుండగా.. భూసేకరణ ఖర్చులో మాత్రం సగభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. భూసేకరణ బాధ్యతలను స్థానిక జిల్లా కలెక్టర్లకు అప్పగించినప్పటికీ రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని మాత్రం ఎన్హెచ్ఏఐ ద్వారానే చెల్లిస్తారు. కాగా, ట్రిపుల్ఆర్ ఉత్తర భాగంలో ఇప్పటికే దాదాపు 3,500 ఎకరాలు సేకరించారు. మిగిలిన 1,000 ఎకరాల్లో సుమారు 200 ఎకరాల అటవీ భూమి ఉన్నది. ఈ భూమికి బదులుగా అటవీశాఖకు మరోచోట భూమిని ఇచ్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ మిగిలిన 800 ఎకరాల సేకరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎన్హెచ్ఏఐ ఆఫర్ చేసిన ధరకు భూములు ఇచ్చేందుకు రైతులు ససేమిరా అంటున్నారు. బహిరంగ మార్కెట్ ధరకు అనుగుణంగా తమకు నష్టపరిహారం చెల్లించాలని లేదా తమకు ప్రభుత్వం మరో చోట భూములు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ట్రిపుల్ఆర్ నిర్మాణానికి తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే కొందరు రైతులు కోర్టును ఆశ్రయించడంతో భూసేకరణపై కోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ఆర్ భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్లపై ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా ఫలితం ఉండకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ట్రిపుల్ఆర్ నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు త్వరలో నష్టపరిహారం చెల్లిస్తామని ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు సేకరించిన భూములకు స్థానిక ఆర్డీవో, కలెక్టర్ నిర్ధారించిన ధరను చెల్లిస్తామని అంటున్నారు. ధర ఎంతన్నది తమకు సంబంధం లేదని, నిబంధనల ప్రకారం అధికారులు నిర్ధారించిన ధర చెల్లిస్తామని చెప్తున్నారు. వచ్చే నెల రెండో వారంలోగా భూసేకరణ పూర్తిచేస్తే టెండర్లకు మార్గం సుగమం అవుతుందని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. భూముల ధర, పరిహారం పెంపుపై ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో ట్రిపుల్ఆర్ భవితవ్యంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.