హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ యూనివర్సిటీలకు రూపాయి ఇవ్వకుండా రెగ్యులేషన్స్ పేరిట పెత్తనం చెలాయించడమేంటని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)ని ప్రశ్నించారు. మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్యాకల్టీ, వీసీల నియామకంపై యూజీసీ విడుదల చేసిన డ్రాఫ్ట్ మార్గదర్శకాలతో వర్సిటీల స్వతంత్రత (అటానమీ) దెబ్బతింటుందని తెలిపారు. యూజీసీ తీరును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు.
ఈ మార్గదర్శకాలు ప్రైవేటైజేషన్‌ను ప్రోత్సహిస్తున్నాయని, వీసీల నియామకాలు పూర్తిగా కేంద్రం చేతుల్లోకి వెళ్తాయని, బ్యూరోక్రాట్స్‌ను వీసీలుగా నియమించాలనుకోవడం సరికాదని పేర్కొన్నారు. యూజీసీ తీరు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని, రాష్ట్ర వర్సిటీలను దెబ్బతీసేలా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయని తెలిపారు. ఈ మార్గదర్శకాలతో జరిగే నష్టంపై ఓ నివేదికను తయారుచేసేందుకు కమిటీ వేశామని, ఈ నివేదిక రాగానే రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు. యూజీసీ మార్గదర్శకాలను కేరళ సహా పలు రాష్ర్టాలు వ్యతిరేకిస్తున్నాయని, త్వరలోనే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి యూజీసీకి లేఖరాస్తారని వెల్లడించారు. యూజీసీ తీరుపై, మార్గదర్శకాలపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ లేఖలు రాయాలని వర్సిటీలను ఆయన కోరారు. ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్లు ప్రొఫెసర్ ఎస్కే మహమూద్, ఇటికాల పురుషోత్తం, మండలి కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశ్ పాల్గొన్నారు.