హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ద్రౌపదీముర్ము శీతాకాల విడిది కోసం సోమవారం రాష్ర్టానికి రానున్నారు. ఆమె సోమవారం నుంచి ఈ నెల 30 వరకు బొల్లారంలోని రాష్ట్రపతిభవన్‌లో శీతాకాల విడిది చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రులు, అధికారులు రాష్ట్రపతికి ఘనస్వాగతం పలుకనున్నారు. ఐదురోజుల పర్యటనలో భాగంగా ఆమె పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఢిల్లీ నుంచి బయలుదేరనున్న రాష్ట్రపతి సోమవారం ఉదయం 10.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 10.50 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం వెళ్తారు.
11 గంటలకు శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం ప్రసాద్ పథకంలో భాగంగా కేంద్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న శ్రీశైలం ఆలయ అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఆ తరువాత శ్రీశైలంలోని శివాజీ స్పూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. శ్రీశైలం పర్యటన అనంతరం సాయంత్రం 4ః15 గంటలకు హకీంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. హకీంపేట విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, అధికారులు రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలుకుతారు. అనంతరం అక్కడ యుద్ధవీరులకు శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పిస్తారు. 5.10 గంటలకు అక్కడి నుంచి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి చేరుకుంటారు. 7.45 గంటలకు రాజ్‌భవన్‌లో జరిగే విందులో రాష్ట్రపతి పాల్గొంటారు.
ఈ నెల 27న హైదరాబాద్‌లోని కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషన్ సొసైటీ విద్యార్థులు, ఉపాధ్యాయుల సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. అదేరోజు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీని సందర్శించి 74వ ఆర్ఆర్ బ్యాచ్ ట్రైనీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. హైదరాబాద్‌లో మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్(మిధాని)లో వైడ్ప్లేట్ మిల్లును ప్రారంభించనున్నారు.
28న భద్రాచలం, రామప్ప సందర్శన
రాష్ట్రపతి 28న భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. ప్రసాద్ పథకం కింద చేపట్టనున్న పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం వనవాసి కల్యాణ్పరిషత్తు-తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమక్క-సారలమ్మ జనజాతి పూజారి సమ్మేళనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్ జిల్లాల్లో ఏకలవ్య మాడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించనున్నారు. అదేరోజు ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సందర్శించి అక్కడ పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, కామేశ్వరాలయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
శ్రీశైలం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
రాష్ట్రపతి ద్రౌపదీముర్ము శ్రీశైలం పర్యటన సందర్భంగా పోలీసులు సోమవారం శ్రీశైలం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. తెలంగాణ, ఆంధ్రా సరిహద్దు ప్రాంతాలైన లింగాలగట్టు, ఏపీ సరిహద్దు ప్రాంతం శిఖరం వద్ద సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వాహనాల రాకపోకలు నిలిపివేస్తామని ఎస్పీ రఘువీర్‌రెడ్డి ప్రకటించారు. శ్రీశైలానికి వచ్చే భక్తులు సోమవారం ఉదయం 10 గంటలలోపు చేరుకొనేవిధంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రాష్ట్రపతి తిరుగు ప్రయాణం సందర్భంగా సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.
29న విద్యార్థులతో భేటీ
29న హైదరాబాద్‌లోని జీ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్(ఉమెన్స్ కాలేజీ), బీఎం మలానీ నర్సింగ్ కాలేజీ, సుమన్ జూనియర్ కాలేజీ ఆఫ్ మహిళా దక్షతా సమితి విద్యార్థులు, ఫ్యాకల్టీ, సిబ్బందితోనూ సమావేశమవుతారు. అదేరోజు శంషాబాద్‌లోని శ్రీరామనగరంలో ఉన్న సమతామూర్తిని సందర్శిస్తారు. డిసెంబర్ 30న రాష్ట్రపతి నిలయంలో వీరనారీమణులు, ఇతర ప్రముఖులతో మధ్యాహ్నం భోజనం చేస్తారు. అదేరోజు రాత్రి 5.30 గంటలకు హకీంపేట నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు.