హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): గోషామహల్లో ఉస్మానియా దవాఖాన కొత్త భవనాల నిర్మాణానికి ఈ నెలాఖరులోగా శంకుస్థాపన జరిగేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఉస్మానియా దవాఖాన నిర్మాణంపై జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో శనివారం సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రతిపాదిత స్థలానికి సంబంధించిన వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని వైద్యారోగ్య శాఖకు వీలైనంత త్వరగా బదిలీ చేయాలని ఆదేశించారు. రెండు శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వెంటనే పూర్తి చేయాలని సూచించారు.
దవాఖాన నిర్మాణానికి సంబంధించిన నమూనా మ్యాప్‌లను పరిశీలించిన సీఎం పలు మార్పుచేర్పులను సూచించారు. అన్ని రకాల ఆధునిక వసతులతో ఆసుపత్రి నిర్మాణం ఉండాలని చెప్పారు. రోడ్లు, పారింగ్, మార్చురీ, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నమూనాలను రూపొందించాలని సూచించారు. భవిష్యత్తులో రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ లాంటి నిర్మాణాలు చేపట్టినా ఇబ్బందులు తలెత్తకుండా డిజైన్లను రూపొందించాలని పేర్కొన్నారు. రోగుల సహాయకులు సేదతీరేందుకు గ్రీనరీ, పారు లాంటి సదుపాయాలు ఉండేలా చూ డాలని అన్నారు. ఈ మేరకు డిజైన్లను రూపొందించాలని అధికారులకు సూచించారు.
2030 కల్లా 418 కిలోటన్నుల గ్రీన్ హైడ్రోజన్
తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. 2030 కల్లా గ్రీన్ హైడ్రోజన్‌ను ఏడాదికి 418 కిలో టన్నులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సోలార్ విద్యుత్తు ఉత్పాదక సామర్థ్యాన్ని 2023కి 19వేల మెగావాట్లకు, 2035 కల్లా 26,374 మెగావాట్లకు చేర్చాలని నిర్దేశించుకుంది.
గ్రేటర్లో అండర్ గ్రౌండ్ విద్యుత్తు కేబుళ్లు!
గ్రేటర్ హైదరాబాద్‌లో అండర్ గ్రౌండ్ విద్యుత్తు కేబుళ్లను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. విదేశాల్లోని ఉత్తమ పాలసీని పరిశీలించి రిపోర్టు సమర్పించాలని ఆదేశించారు. ఔటర్ రింగ్‌రోడ్డు లోపల పూర్తిగా అండర్‌గ్రౌండ్ కేబుల్ విధానాన్ని తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.