గండీడ్/మహ్మదాబాద్, జూన్ 10: క్రాప్లోన్లు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించలేదన్న కారణంతో వారి ఆస్తుల జప్తునకు రంగం సిద్ధమైంది. బాధిత రైతుల పేరిట ఏకంగా నోటీసులను జారీ చేసిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటుచేసుకున్నది. గండీడ్ మండల కేంద్రంలోని కోఆపరేటివ్ బ్యాంక్, మహ్మదాబాద్కు చెందిన సహకార సంఘంలో పలువురు రైతులు స్థిరాస్తిని తాకట్టు పెట్టి వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. సకాలంలో బాకీ చెల్లించకపోవడంతో తాకట్టు పెట్టిన వారి భూములను వేలం వేయడానికి అధికారులు సిద్ధమయ్యారు.
రెండు మండలాల్లోని 14 మంది రైతుల ఆస్తులను జప్తు చేయడానికి అధికారులు సిద్ధంకాగా, తాజాగా ఆరుగురు రైతుల పేర్లను తొలుత నోటీస్బోర్డుపై ఉంచారు. సహకార సొసైటీ సిబ్బంది బహిరంగంగా నోటీసు బోర్డులపై రైతుల పేర్ల జాబితాను అతికించారు. రెండు మండలాల తహసీల్దార్ కార్యాలయాల వద్ద వేలం వేస్తున్న రైతుల వివరాలు నోటీస్ బోర్డులపై ఉంచడంతో సదరు అన్నదాతలు అవాక్కయ్యారు. వేలల్లో బాకీ ఉన్న రైతుల పేర్లు మాత్రమే నోటీసు బోర్డులో పెట్టి, రూ.లక్షలు బాకీ ఉన్న వారి పేర్లు జాబితాలో పెట్టకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.