హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): గ్రామ పంచాయతీ ఎన్నికల కసరత్తు లో భాగంగా వార్డుల వారీగా ఓటరు జాబితా తయారి ప్రక్రియ చురుగ్గా సాగుతున్నది. పంచాయతీల్లో జనాభా ఆధారంగా వార్డులు ఎన్ని ఉండాలనే ఉన్నతాధికారులు నిర్దేశించారు. 2011 జనాభాను పరిగణనలోకి తీసుకొని వార్డుల సంఖ్యను నిర్ధారించారు. గ్రా మంలో ఉన్న ఓటర్ల సంఖ్య, అన్ని వార్డుల్లో సమానంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని గ్రామాల్లో ఇప్పటికే వార్డుల వారీగా ముసాయిదా జాబితాను రూపొందించారు. కార్యదర్శులకు ఎదురయ్యే సమస్య లు, సందేహాలను ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు తీరుస్తున్నారు. వార్డులవారీగా జాబితా తయారు చేయటంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఓటరు జాబితాను ప్రా మాణికంగా తీసుకొంటున్నారు.
జాబితాలో కొందరు ఒకే కుటుంబానికి చెందినవారు ఉన్నా.. వారి పేర్లు ఒకే దగ్గర లేకపోవటంతో వారందర్నీ గుర్తించడానికి ఎక్కువ సమయం పడుతున్నదని కార్యదర్శులు చెప్తున్నారు. ఉన్నతాధికారుల పరిశీలన అనంతరం వచ్చే నెల 6న ముసాయిదా జాబితాను ప్రకటిస్తారు. వాటిపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 21న తుది జాబితాను ప్రకటిస్తారు. అయితే, ఇదే సమయంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను కూడా క్లియర్ చేయాలని ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారు. పారిశుద్ధ్యం, సర్టిఫికెట్ల జారీ తదితర పనులు చేసుకోవాల్సి ఉంటుందని, వీటన్నింటినీ ఒకేసారి చేయాల్సి రావడంతో ఒత్తిడికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు