మహదేవపూర్, మే 26 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌లో కుంగిన పియర్ల దిగువ భాగంలో ఖాళీ ప్రదేశాన్ని ఇసుక, సిమెంట్‌తో గ్రౌటింగ్ చేసి పూడ్చేందుకు పంపింగ్ యంత్రాలు ఆదివారం బరాజ్ వద్దకు చేరుకున్నాయి. బరాజ్ ఏడో బ్లాక్‌లో 11 గేట్లకు గాను 12, 13, 14, 15వ గేట్లు ఎత్తారు. మిగిలిన 16, 17, 18, 19వ గేట్లు ఎత్తాల్సి ఉన్నది. గ్రౌటింగ్ పూర్తయిన తర్వాత మిగతా గేట్లు ఎత్తుతారు. బరాజ్‌లో కుంగిన ప్రాంతంలోని 20, 21 గేట్లను ఆర్క్ కటింగ్ ద్వారా తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది. బరాజ్ అప్‌స్ట్రీమ్‌లో ఏడో బ్లాక్ వరకు జరుగుతున్న మరమ్మతులకు వరదతో ఆటంకం కలుగకుండా నీటి మళ్లింపు కోసం మట్టి కట్టలు వేస్తున్నారు. డౌన్‌స్ట్రీమ్‌లో ఏర్పడిన ఊటలను యంత్రాలతో పంపింగ్ చేస్తున్నారు. బరాజ్‌లో అప్, డౌన్‌స్ట్రీమ్‌లో ప్రవాహానికి అడ్డుగా ఉన్న ఇసుకను ఎక్స్కవేటర్లతో తొలగిస్తున్నారు.