Huzurabad | హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 14 : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జాతీయస్థాయి అవార్డులు అందుకున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా దవాఖానలో ఇప్పుడు వైద్య సేవలు కునారిల్లుతున్నాయి. ప్రతి నెలా 180 నుంచి 200 కాన్పులు చేసి రికార్డులు సృష్టించిన ఈ దవాఖానకు ఇప్పుడు కాన్పులకు వెళ్లాలంటేనే గర్భిణులు హడలిపోతున్నారు. వైద్యులు అందుబాటులో లేక గంటల తరబడి పురిటి నొప్పులు భరిస్తూ నరకయాతన పడుతున్నారు. అనెస్థీషియా వైద్యుడు అందుబాటులో లేక సోమవారం ఆరుగురు గర్భిణులకు కాన్పులు చేయకపోవడంతో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు వారంతా నరకం చూశారు. వివిధ గ్రామాలకు చెందిన ఆరుగురు గర్భిణులు సోమవారం ఉదయం 8 గంటలకు దవాఖానకు వచ్చారు. 12 గంటలకు ఆపరేషన్ చేసేందుకు సిబ్బంది అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ, మత్తు వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో ఆయన వచ్చే వరకు వారు అలానే బెడ్‌పై ఉండాల్సి వచ్చింది. అప్పటికే వారికి యూరిన్ కేథటర్ వేయడం, నొప్పులు పెరగడంతో గర్భిణుల అవస్థలు అన్నీ ఇన్నీకావు. ఏడు గంటలపాటు వారంతా నరకం అనుభవించారు. ఈ క్రమంలో ఓ గర్భిణి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య డ్యూటీ డాక్టర్ ఒకసారి వచ్చి పరిస్థితిని చూశారు. మత్తు వైద్యులు లేరని, వచ్చిన తర్వాత ఆపరేషన్లు చేస్తామని చెప్పి వెళ్లిపోయారు. దీంతో గర్భిణుల బంధువులు మీడియాకు సమాచారం ఇచ్చారు. మీడియా అక్కడికి రావడం, బంధువులు ఆందోళనకు దిగితే తప్ప వైద్యుల్లో కదలిక రాలేదు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మత్తు వైద్యుడిని పిలిపించి రాత్రి 8:30 గంటలకు కాన్పులు చేశారు.
దవాఖానలో మత్తు వైద్యుడు లేక పోవడంతోనే ఈ పరిస్థితి వచ్చింది. దవాఖానలో మత్తు వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ సురేశ్ మధ్యాహ్నం 12 గంటలకు ముందే దవాఖానకు వచ్చినట్టు తెలిసింది. ఆ సమయంలో ఆయన దగ్గరి బంధువులు చనిపోయినట్టు కబురు రావడంతో సెలవు కూడా పెట్టకుండా వెళ్లిపోయినట్టు చెప్తున్నారు.
గర్భిణుల విషయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న వార్తల్లో నిజం లేదని దవాఖాన సూపరింటెండెంట్ రాజేందర్‌రెడ్డి, ఆర్ఎంవో సుధాకర్‌రావు స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగానే వైద్యులపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సుమారు 110 మంది గర్భిణులకు వైద్యులు పరీక్షలు చేశారని, ఆపరేషన్ కోసం ఆరుగురిని అడ్మిట్ చేసుకున్నట్టు చెప్పారు.
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ ఏరియా దవాఖానలో వైద్యం కోసం గంటల తరబడి గర్భిణులు వేచి చూసిన ఘటనపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘దవాఖనాలోపురిటి నొప్పులతో వైద్యుల కోసం గంటల పాటు ఎదురుచూస్తున్న గర్భిణుల ఆవేదన వర్ణనాతీతం. పేరుకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏరియా దవాఖాన. కానీ గైనకాలజిస్టు, అనస్తీషియా వైద్యుడు లేని దారుణ పరిస్థితి. పాలన గాలికి వదిలి, అనునిత్యం రాజకీయాల గురించే మాట్లాడే ముఖ్యమంత్రి గారికి గర్భిణుల ఆవేదనైనా వినపడుతున్నదా? తక్షణమే గర్భిణులకు అవసరమైన అత్యవసర వైద్యం అందించి ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం’ అని డిమాండ్ చేశారు.