నాసిక్ : మహారాష్ట్రలోని గిరిజన ప్రాంతాలలో మౌలిక సదుపాయాల లేమి ఒక నిండు గర్భిణి ప్రాణాన్ని బలితీసుకుంది. వైద్య చికిత్స కోసం దవాఖానకు వచ్చేందుకు బురదతో నిండిన రోడ్డులో నడుచుకుంటూ వచ్చిన మహిళ గమ్యం చేరకుండానే ప్రాణాలు విడిచిన విషాదకర ఘటన నాసిక్ జిల్లాలో చోటుచేసుకుంది. లగట్పురి తాలుకాలో నివసించే వనితా భగత్ అనే ఏడు నెలల గర్భిణి వైద్య చికిత్స కోసం జున్వనేవాడిలోని దవాఖానకు మంగళవారం తన గిరిజన గూడెం నుంచి బయలుదేరింది. సరైన రోడ్డు లేకపోవడంతో బురదతో నిండిన మార్గంలోనే రెండున్నర కిలోమీటర్లు అతికష్టంగా నడిచింది. మార్గమధ్యంలో భరించలేని నొప్పి రావడంతో తట్టుకోలేక మృతి చెందింది. లగట్పూరి తాలుకా లాంటి ప్రాంతాలు మౌలిక సదుపాయాలు లేక వెనుకబడే ఉన్నాయని భగవాన్ మందే అనే స్థానిక గిరిజన సంస్థ తీవ్ర ఆరోపణ చేసింది.