నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 24: జగిత్యాల జిల్లా రైతు జేఏసీ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లకుండా నిజామాబాద్ జిల్లా రైతు నాయకులను పోలీసులు సోమవారం అడ్డుకున్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా రైతు జేఏసీ సోమవారం చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి వెళ్లకుండా నిజామాబాద్ జిల్లాలోని క మ్మర్పల్లి, వేల్పూర్, ముప్కాల్, ఆర్మూర్ మండలాల్లో రైతులు, నాయకులను స్టేషన్ కు తరలించారు.రైతు నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం హామీలను అమలుచేయకపోగా, కనీసం రైతులు నిరసన తెలుపుకొనే అవకాశం కూడా ఇవ్వకుండా నిర్బంధించడం దారుణమని అన్నారు.
రుణమాఫీ చేయాలని రైతుల నిరసన
నిర్మల్ జిల్లా భైంసాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రూ.2 లక్షల రుణాన్ని మాఫీ చేయాలని రైతులు నిరసన తెలిపారు. సోమవారం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ఉదయం 11 నుంచి 11.30 గంటల వరకు ఆందోళన నిర్వహించారు. రేవంత్రెడ్డి మాట్లాడుతున్నది ఒకటి, చేస్తున్నది మరొకటి అని మండిపడ్డారు. రూ.2 లక్షల వరకు రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు చేయమనడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. – భైంసా