హైదరాబాద్ జూలై 6 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఏ వెంకట్ డిమాండ్‌చేశారు. ఆదివారం సంఘం రాష్ట్ర కార్యాలయంలో యూనియన్ ఆఫీస్ బేరర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని కోరారు.
ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ మీటింగ్‌లో ప్రతినెలా రూ.700కోట్లు విడుదల చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గతనెల కేవలం రూ.180కోట్లు మాత్రమే విడుదల చేయడం విడ్డూరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నదని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కోశాధికారి లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రాములు, రాజశేఖర్‌రెడ్డి, శాంతకుమారి, నాగమణి, రంజిత్, మల్లారెడ్డి, శ్రీధర్, దుర్గాభవాని పాల్గొన్నారు.