హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ ఉద్యోగులకు మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వారి అరణ్య రోదన వినాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు హితవు చెప్పారు. సోమవారం ఆయన అసెంబ్లీలో జీరో అవర్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసుల సమస్యలపై మాట్లాడారు. ‘ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి రథచక్రాల్లాంటివారు. వాళ్లు సంతోషంగా ఉంటేనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రజలకు సజావుగా చేరే అవకాశం ఉంటుంది. అటువంటి ఉద్యోగులు ప్రస్తుతం తీవ్ర మనోవేదనతో ఉన్నారు. దేశంలో ఎకడాలేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చి రెండేండ్లయినా ఇంతవరకూ పీఆర్సీ ఇవ్వలేదు. తమకు వెంటనే పీఆర్సీ ఇవ్వాలని ఉద్యోగులు కోరుతున్నారు. కాబట్టి, వెంటనే పీఆర్సీ విడుదల చేయాలి. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 43%, 39% పీఆర్సీ ఇచ్చాం’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ సీమ్ (ఈహెచ్ఎస్) అమలుకు మేము ఆ రోజు జీవో కూడా ఇచ్చాం. దాన్ని మీరు అమల్లోకి తెస్తామని చెప్పి, మ్యానిఫెస్టోలో పెట్టి కూడా ఈహెచ్ఎస్ సీమ్‌ను అమల్లోకి తేలేదు. దాన్ని కూడా వెంటనే అమల్లోకి తేవాలి. ఉద్యోగుల జీపీఎఫ్ తదితర బకాయిలన్నీ విడుదల చేయాలి’ అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రిటైర్డ్ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక, సకాలంలో వైద్యం అందక చనిపోతున్నారని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. ‘39 మంది రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి బెనిఫిట్స్ రాక, వాళ్ల సేవింగ్స్ వారికి ఇవ్వకపోవడం వల్ల వైద్యం కూడా చేయించుకోలేక మరణించారు. బీఆర్ఎస్ హయాంలో 17 వేల మంది రిటైర్ అయితే వారందరికీ మేము సమయానికి డబ్బులు ఇచ్చాం. కానీ, కాంగ్రెస్ హయాంలో నేటికీ అవి విడుదల కావడం లేదు’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. సోమవారం సిద్దిపేట నుంచి తాను అసెంబ్లీకి వస్తుంటే ఉదయం రిటైర్డ్ వెటర్నరీ జేడీ డాక్టర్ జగత్‌కుమార్‌రెడ్డి తనతో గోడు చెప్పుకున్నారని తెలిపారు. ‘ఆ డాక్టర్ అక్టోబర్ 2024లో రిటైర్ అయినా ఇంతవరకు ఒక రూపాయి రాలేదు. అతను హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నా కూడా పైసల్ రాలేదు. హైకోర్టులో కంటెంప్ట్ వేసినా వాయిదాలు అడుగుతూ ప్రభుత్వం వారిని ఇబ్బందులు పెడుతున్నది’ అని వాపోయారని హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘రిటైర్డ్ ఉద్యోగులంతా.. తమ పెన్షన్ బెనిఫిట్స్ ఇప్పించాలని కోరుతున్నారు. చావు బతుకుల్లో ఉన్నటువంటి తమను కాపాడాలని వేడుకుంటున్నారు. 30-35 ఏండ్లపాటు ప్రభుత్వానికి సేవ చేసిన రిటైర్డ్ ఉద్యోగులను ఈ రకంగా వేధించడం ప్రభుత్వానికి తగదు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు.
పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉన్న విషయాన్ని హరీశ్‌రావు సభ, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ‘పోలీసు విభాగంలో ఐదు సరెండర్ లీవులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటితోపాటు టీఏలు, డీఏలు రావడం లేదు. ఆఖరికి స్టేషన్ అలవెన్స్ కూడా రావట్లేదు’ అని ఆవేదన వ్యక్తంచేశారు. ‘మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ ఉంటే ఒక్క యూసఫ్‌గూడ బెటాలియన్‌కు మాత్రం టీఏలు, డీఏలు, సరెండర్స్ ఇచ్చారు. రాష్ట్రంలో లక్ష మంది పోలీసులకు సరెండర్స్, టీఏలు, డీఏలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. గతంలో నేను ఆర్థిక మంత్రిగా ఎప్పటికప్పుడు సరెండర్ లీవ్‌లు, డీఏలు, టీఏలు ఇచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చి రెండేండ్లయినా అవన్నీ పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు. పోలీసులకు ఉండే ఆరోగ్య భద్రతా సీమ్‌ను కూడా బంద్ చేశారని, దీంతో పోలీసులు కూడా ఆవేదనలో ఉన్నారని మండిపడ్డారు. ‘తెలంగాణ పోలీసు ఆరోగ్య భద్రతా పథకాన్ని కేవలం లక్ష రూపాయలకే పరిమితం చేశారు. దీనివల్ల పోలీసు కానిస్టేబుళ్లు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఆరోగ్య భద్రతను పునరుద్ధరించండి. గతంలో మాదిరిగా కార్పొరేట్ వైద్యం పోలీసులకు అందించాలి’ అని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం తక్షణమే ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని, పీఆర్సీ ఇవ్వాలని, రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని, పోలీసులకు కూడా మేలు చేయాలని కోరారు. అంతకుముందు ‘జీరో అవర్’ను ఒక అరణ్య రోదనగా మార్చకండని, ఏదో మాట్లాడటం అంటే మాట్లాడటం కాదని, సభ్యుల ప్రశ్నలకు ఆన్సర్ రావాలని, అది కూడా రాతపూర్వకమైన సమాధానాన్ని వచ్చే సెషన్‌లోపు సభ్యులకు అందజేయించాలని కోరారు.
ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన సీపీఎస్ కాంట్రిబ్యూషన్ కట్టకపోవడంపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘సీపీఎస్ ఉద్యోగులను ఓపీఎస్‌గా మారుస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. మరి ఎప్పట్లోగా ఓల్డ్ పెన్షన్ సీమ్ అమలుచేస్తారు?’ అని నిలదీశారు. ‘రెండేండ్ల నుంచి సీపీఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన కాంట్రిబ్యూషన్ డబ్బులను కూడా కట్టకుండా వాటిని దారి మళ్లిస్తున్నారు. రెండు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు’ అని మండిపడ్డారు. ‘ఇచ్చిన మాటకు కట్టుబడి తక్షణం ఓపీఎస్ విధానాన్ని తీసుకురావాల’ని డిమాండ్ చేశారు.