హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): 2021 వేతన సవరణను 11 శాతం ఫిట్మెంట్తో జూలై 1 నుంచి చెల్లించడానికి ఆర్టీసీ యాజమాన్యం అంగీకరించింది. ఈ మేరకు ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు గురువారం మీడియాకు వెల్లడించారు. ఆర్టీసీ యాజమాన్యం, జేఏసీ నాయకులతో జరిపిన చర్చలలో పలు అంశాలను యాజమాన్యం అంగీకరించినట్టు తెలిపారు. 2017 వేతన సవరణ అలవెన్సులు, ఫ్రింజ్ బెనిఫిట్స్ 80 శాతానికి పెంచి ఇవ్వడానికి, 2021 వేతన సవరణ 11% ఫిట్మెంట్తో జూలై 1న చెల్లించడానికి అంగీకరించారని చెప్పారు. వీటితోపాటు బ్రెడ్ విన్నర్ సీమ్‌లో ప్రస్తుతం పని చేస్తున్నవారందరినీ రెగ్యులర్ చేయడానికి, వారి సర్వీస్ సీనియారిటీ కొనసాగించడానికి, మున్ముందు జరిపే నియామకాలను రెగ్యులర్ ప్రాతిపదికన చేపట్టడానికి అంగీకరించారని తెలిపారు. జూనియర్ అసిస్టెంట్ పాస్ అయిన వారందరికీ ఈ నెలాఖరులో పోస్టింగ్ ఇస్తారని తెలిపారు. రిటైర్డ్ ఉద్యోగులకు గతంలో మాదిరిగా రెండు నెలలకు సరిపడే మందులు ఒకేసారి ఇవ్వడానికి, తార్నాక దవాఖానలో రోగులు, సహాయకుల కోసం రూ.40 లక్షలతో విశ్రాంతి, డైనింగ్ హాల్ నిర్మించాలని నిర్ణయించారు.