మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 02:26:39

ఈద్గాల్లో ప్రార్థనలకు అనుమతి లేదు

ఈద్గాల్లో ప్రార్థనలకు అనుమతి లేదు

  • బక్రీద్‌కు ఆవులను బలివ్వద్దు
  • హోంమంత్రి మహమూద్‌ అలీ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బక్రీద్‌ సందర్భంగా ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ స్పష్టంచేశారు. మసీదుల్లో భౌతికదూరం, పరిశుభ్రత పాటిస్తూ ప్రార్థనలు చేసుకోవాలని ముస్లింలకు సూచించారు. ఎవరి ఇంట్లో వారు ప్రార్థనలు చేసుకోవడం మరింత ఉత్తమమని అభిప్రాయపడ్డారు. బక్రీద్‌ ఏర్పాట్లు, తీసుకోవాల్సిన చర్యలపై హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌తో గురువారం లక్డీకాపూల్‌లోని తన కార్యాలయంలో హోంమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆగస్టు ఒకటి నుంచి మూడురోజులపాటు జరిగే బక్రీద్‌లో ఆవులను బలి ఇవ్వకూడదని మహమూద్‌అలీ విజ్ఞప్తిచేశారు. ఆవులు తప్ప ఇతర జంతువుల రవాణాను పోలీసులు అనుమతిస్తారని, అయితే అన్ని నిబంధనలు పాటించాలని సూచించారు. కాగా, సుమారు ఇదే తరహాలో నిబంధనలు పాటించాలని పేర్కొంటూ మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి అహ్మద్‌ నదీమ్‌ గురువారం మార్గదర్శకాలు జారీచేశారు. logo