హైదరాబాద్/సిటీబ్యూరో/నాంపల్లి కోర్టులు, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ)/మామిళ్లగూడెం: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డిని కస్టడీకి అప్పగించాలని కోరిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థనను నాంపల్లి 2వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు శనివారం ఆమోదించింది. 17, 18 తేదీల్లో వీరిద్దని ఈడీ చంచల్‌గూడ జైలులోనే విచారించనున్నది. ఈ మేరకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీచేసింది. మనీ లాండరింగ్‌పై దృష్టిపెట్టిన ఈడీ.. ఈ కేసులో ప్రవీణ్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ కేసులో నిందితులైన ఢాక్యానాయక్ (ఏ4), రాజేశ్వర్ (ఏ5) వేసిన రెండో బెయిల్ పిటిషన్ కోర్టు డిస్మిస్ చేసింది. ఏ3, ఏ8, ఏ9 నిందితుల బెయిల్ పిటిషన్లను సోమవారానికి న్యాయస్థానం వాయిదా వేసింది.
ఖమ్మంలో సాయిలౌకిక్ ఇంట్లో సిట్ సోదాలు
డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రశ్నపత్రం కొనుగోలు కేసులో ఖమ్మం జిల్లాకు చెందిన సాయిలౌకిక్, సుష్మిత దంపతులను సిట్ అధికారులు రెండోరోజు శనివారం విచారించారు. ఖమ్మంలోని వారి నివాసానికి తీసుకువెళ్లారు. ఏడుగురు సభ్యులతో వెళ్లిన అధికారులు 4 గంటలపాటు నిందితులతోపాటు వారి కుటుంబ సభ్యులను విచారించారు. సాయిలౌకిక్.. అతడి భార్య సుస్మిత రాస్తున్న డీఏవో పోటీ పరీక్షకు ప్రవీణ్‌కుమార్ నుంచి ప్రశ్నపత్రం కొనుగోలు చేశాడు. సాయిలౌకిక్ బ్యాంకు ఖాతా నుంచి ప్రవీణ్ ఖాతాకు రూ.6 లక్షలు బదిలీ అయినట్టు సిట్ గుర్తించిందని సమాచారం. నిందితులు స్థానికంగా మరెవరికైనా ఆ పేపర్‌ను విక్రయించారా అనే కోణంలో సిట్ విచారించినట్టు తెలిసింది. వృత్తిరీత్యా ప్లానింగ్ విభాగంలో సహాయ గణాంకాల అధికారి అయిన సాయిలౌకిక్ తండ్రి శ్రీకాంత్‌తో సహా ఆయన భార్యను సైతం పోలీసులు విచారించారు. వారి సెల్ఫోన్లను సీజ్ చేసినట్టు తెలిసింది.