ప్రత్యూష్ సిన్హా కమిటీ మార్గదర్శకాలు చట్ట వ్యతిరేకం
హైకోర్టులో సీఎస్ తరఫు న్యాయవాది వాదన
హైదరాబాద్, నమస్తే తెలంగాణ : రాష్ట్ర విభజన నేపథ్యంలో అఖిల భారత సర్వీసు అధికారుల (ఐఏఎస్, ఐపీఎస్ ) కేటాయింపు తెలంగాణ, ఏపీలకు విభజన చట్టానికి వ్యతిరేకంగా జరిగిందని సీఎస్ సోమేష్ కుమార్ హైకోర్టుకు తెలిపారు. అధికారుల విభజన నిమిత్తం ప్రత్యూష్ సిన్హా కమిటీ చేసిన మార్గదర్శకాలు ఆమోదయోగ్యంగా లేవని, చట్ట విరుద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఆ కమిటీ సిఫారసుల మేరకు జరిగిన పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపులను రద్దు చేస్తూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (క్యాట్ ) ఇచ్చిన ఉత్తర్వుల్లో హైకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.
క్యాట్ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన 16 పిటిషన్లను న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్ నంద లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. సీఎస్ తరఫు సీనియర్ న్యాయవాది డీవీ సీతారామమూర్తి వాదనలు వినిపించారు. చట్ట నిబంధనలకు అనుగుణంగా అధికారుల కేటాయింపులు జరగలేదన్నారు. లాటరీలో రోస్టర్ ను ముందుగా తెలంగాణకు కేటాయించాలని, అయితే అందుకు విరుద్ధంగా ఏపీకి కేటాయించారని చెప్పారు. క్యాడర్ కేటాయింపుల వ్యవహారంపై కేంద్రం ఒక విధానాన్ని అమలు చేయకుండా తరుచుగా మార్పు చేస్తూ వచ్చిందని పేర్కొన్నారు. ప్రత్యూష్ సిన్హా కమిటీలో ఉమ్మడి ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి సభ్యుడిగా కొనసాగడం సరికాదని చెప్పారు. తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 7కు వాయిదా వేసింది.