న్యూఢిల్లీ: రోల్స్ రాయిస్(Rolls Royce) కంపెనీ ఇండియాలో తన వ్యాపారాన్ని విస్తరించనున్నది. అయితే యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన ఏరో ఇంజిన్లను అభివృద్ధి చేసేందుకు ఆ కంపెనీ ఆసక్తి ప్రదర్శిస్తున్నది. రక్షణ, పౌరవిమానయాన, ఎనర్జీ రంగాల్లోనూ రోల్స్ రాయిస్ కంపెనీ తన భాగస్వామ్యాన్ని విస్తరించనున్నది. భారత్కు అవసరమైన 120 కిలో న్యూటన్ క్లాస్ యుద్ధ విమాన ఇంజిన్ను అభివృద్ధి చేయనున్నామని, దీని కోసం యూకే ప్రభుత్వంతో సహా భారత్ ఆసక్తిగా ఉన్నట్లు కంపెనీ తన ప్రకటనలో చెప్పింది. కో డెవలప్మెంట్లో భాగంగా పూర్తి స్థాయిలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయనున్నారు. ఐపీ ఓనర్షిప్ కూడా ట్రాన్స్ఫర్ కానున్నది. ఈ నేపథ్యంలో రోల్స్ రాయిస్ సీఈవో టుఫాన్ ఎరిగిన్బిల్జిక్ గురువారం ప్రధాని మోదీని కలిశారు. భారత్ ప్రగతిలో భాగస్వామ్యం కావాలనుకుంటున్నట్లు రోల్స్ రాయిస్ సీఈవో తెలిపారు.