హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ ) : గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల ను రీ వాల్యుయేషన్ చేయించాల్సిందేనని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ డిమాండ్ చేశారు. లోపభూయిష్టంగా ఉన్న మెయిన్స్ ఆన్సర్‌షీట్లను రీ వాల్యుయేష న్ చేసే వరకు పోరాడుతామని స్పష్టంచేశారు. 20,100 మంది అభ్యర్థుల పేపర్లను పునఃమూల్యాంకనం చేయించాల్సిందేనని పునరుద్ఘాటించారు. గ్రూప్-1 రగడ నేపథ్యంలో శుక్రవారం ప్రసన్న హరికృష్ణ ‘నమస్తే తెలంగాణ’కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘టీజీపీఎస్సీ ప్రతిభావంతులకు పట్టంకడతామని ఇటీవల ప్రకటించింది. అసలైన ప్రతిభావంతులను తేల్చేందు కు మరోసారి వాల్యుయేషన్ చేస్తే, మరో మూడు నెలల ఆలస్యంగా ఫలితాలు ప్రకటిస్తే తప్పేంకాదు. గ్రూప్-1 నోటిఫికేషన్ 13 ఏండ్ల తర్వాత వచ్చింది. 60 ఏండ్ల భవిష్యత్తు ను నిర్దేశించేందుకు రీ వాల్యుయేషన్ చేస్తే ఇబ్బందేమీరాదు. టీజీపీఎస్సీ పారదర్శకంగా, జవాబుదారీతనంగా వ్యవహరించి, నమ్మకా న్ని నిలబెట్టుకోవాలి’ అని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
రిజల్ట్స్‌లో భాగంగా జనరల్ ర్యాంకింగ్ లిస్టు (జీఆర్ఎల్) విడుదల చేస్తున్న టీజీపీఎస్సీ, గ్రూప్-1 మెయిన్స్ జీఆర్‌ఎల్‌ను ఎందుకు విడుదల చేయలేదు? వారం వ్యవధిలో గ్రూప్-2, గ్రూప్-3 జీఆర్ఎల్ విడుదల చేసిన కమిషన్ గ్రూప్-1 మెయిన్స్ జీఆర్‌ఎల్‌ను విడుదల చేయలేదంటేనే ఏదో గూడుపుఠాణి దాగి ఉన్నది. మెయిన్స్ మార్కులను కేవలం అభ్యర్థి లాగిన్ ఐడీలో ఎందుకు పొందుపరిచారు? పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు?
గ్రూప్-1 మెయిన్స్ తెలుగు మీడియంలో రాసిన వారికి 50-100 వరకు తక్కువ మా ర్కులేశారు. ఇంగ్లిష్ మీడియంలో రాసిన వారి కి ఎక్కువ మార్కులేశారు. దీంతో తెలుగులో రాసిన వారికి తీవ్ర అన్యాయం జరిగింది. తెలుగు మీడియంలో రాయడమే తప్పా? చాలా సీరియస్‌గా ప్రిపేర్ అయిన వారికి అంచనాల కంటే 100 మార్కులు తగ్గాయి. ఇది అనుమానాలకు తావిస్తున్నది. టాప్-100లో తెలుగు, ఇంగ్లిష్ మీడియం అభ్యర్థులు ఎందరున్నారో ఎందుకు బయటపెట్టడంలేదు. టాప్-100లో ఎస్సీలు ముగ్గురే ఉన్నారు. ఎస్టీల సంఖ్య అతి తక్కువగా ఉన్నది. ఐఏఎస్ తర్వాత అత్యంత కీలకమైన ఉద్యోగాల భర్తీలో సామాజిక న్యాయం జరగకపోతే, ఉద్యోగాలు భర్తీచేసి ఏం లాభం?
గతంలో బీఆర్ఎస్ సర్కారు జారీచేసిన జీవో-55తో సామాజిక న్యాయం జరిగింది. ఈ జీవోను పక్కనపెట్టి కాంగ్రెస్ సర్కారు జీవో-29 తెచ్చింది. ఇది సామాజిక న్యాయానికి విరుద్ధంగా ఉన్నది. ఈ జీవో ఇచ్చినట్టు ఎవరికీ తెలియదు. 2024 ఫిబ్రవరిలో గ్రూప్-1 రీ నోటిఫికేషన్ ఇస్తే, ప్రిలిమ్స్ పరీక్ష తర్వాత ఆగస్టులో జీవో-29ని వెబ్సైట్లో పెట్టారు. ఇంత గోప్యత, రహస్యం ఎందుకు?
మూల్యాంకన బాధ్యతలను కొందరు ఆంధ్రా వాళ్లకు అప్పగించినట్టు తెలిసింది. తెలంగాణ ఉద్యమ చరిత్ర-రాష్ర్టావతరణ పేప ర్ మూల్యాంకనాన్ని కోఠి మహిళా కాలేజీలో పనిచేసే ఆంధ్రా మూలాలున్న అసిస్టెంట్ ప్రొ ఫెసర్కు అప్పగించినట్టు వార్తలొచ్చాయి. అసిస్టెంట్ ప్రొఫెసరేమో చీఫ్ ఎగ్జామినర్ (సీఈ) అయితే, ప్రొఫెసర్లకు ఎగ్జామినర్ విధులు కేటాయించారు. ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద ప్రొఫెసర్ పనిచేస్తారా? ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా? సదరు అసిస్టెంట్ ప్రొ ఫెసర్ తనకు కావాల్సిన వాళ్లకు నచ్చినట్టుగా మార్కులేసినట్టు ప్రచారం జరుగుతున్నది. పదేండ్ల క్రితం రూపొందించిన పాఠాలను బోధించే వారిచేత మెయిన్స్ మూల్యాకంనం చేయించడమే దౌర్భాగ్యం.
ప్రొఫెసర్లతో చేయించాల్సిన మూల్యాంకనా న్ని డిగ్రీ కాలేజీ లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల చేత చేయించినట్టు ప్రచారం జరుగుతున్నది. మూల్యాంకనంలో రోజుకు 20 పేపర్లు మాత్ర మే చేయాల్సి ఉండగా, 60 పేపర్లు ఇచ్చినట్టు, చివరి 10-15 రోజుల్లో రోజుకు 100 పేపర్లు దిద్దించినట్టు నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు. ఎకానమీ పేపర్‌ను సోషియాలజీ ఫ్యాకల్టీ చేత మూల్యాంకంనం చేయించినట్టు, బ్లూప్రింట్‌ను ఇంగ్లిష్‌లో రూపొందించి, తెలుగు కోసం గూగు ల్ ట్రాన్స్‌లేట్ చేసి ఇచ్చినట్టు తెలిసింది. ఇంత కన్నా ఘోరం మరొకటి ఉంటుందా?
మెయిన్స్ మూల్యాంకనం మొత్తం లోపాలపుట్ట అని, మొదటిసారి మూ ల్యాంకనంలో తక్కువ మార్కులేశారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. దీంతో ఎవరికీ క్వాలిఫై మార్కులు రాలేని పరిస్థితి ఉండటంతో తర్వాత లిబరల్గా దిద్దారని చెప్తున్నారు. ఓసీలకు 40%, బీసీలకు 35%, ఎస్సీ ఎస్టీలకు 30% మా ర్కులొస్తే క్వాలిఫై అయినట్టు లెక్క. మొదటి స్పెల్‌లో దిద్దిన పేపర్లకు, రెండో స్పెల్‌లో దిద్దిన పేర్లకు మార్కుల అంతరం పెరిగిందనే వాదన వినిపిస్తున్నది. చాలామందికి అయితే తక్కువ గా, లేదంటే ఎక్కువగా మార్కులొచ్చాయన్న ఆందోళనలు నిరుద్యోగుల్లో వ్యక్తమవుతున్నాయి.