కౌటాల, అక్టోబర్ 7 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని, చింతలమానేపల్లి మండలంలోని ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించిన కాలువలను ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రశాంత్ జీవన్ పాటిల్ మంగళవారం పరిశీలించారు. ప్రాణహిత నదిలో నీటి లభ్యత, నీటి ప్రవాహం, ప్రాజెక్టు నిర్మాణ స్థలం, ఇక్కడి భూమి స్థితిగతులు, రణవెల్లి, గంగాపూర్, కర్జెల్లీ సమీపంలోని ప్రాణహిత ప్రాజెక్టు సంబంధించిన ప్యాకేజీ 1,2,3 కాలువలను పరిశీలించారు.
ప్రాణహిత ఎగువన ఉన్న వెన్ గంగా, వార్దా నదుల కలయిక, నిర్మాణ స్థలాన్ని బైనాక్యులర్తో పరిశీలించారు. ఆయన వెంట ఇరిగేషన్ సీఈ సత్యరాజచంద్ర, కాగజ్నగర్ ఎస్ఈ రవికుమార్, ఈఈ ప్రభాకర్, తహసీల్దార్ ప్రమోద్ కుమార్, డీఈ వెంకటరమణ, భద్రయ్య తదితరులున్నారు.