గీసుగొండ, జూన్ 26 : పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చదివించే కుటుంబాలకు రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు తొలగించే అవకాశాలు ఉన్నాయని పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్థికంగా ఉన్న కుటుంబాలే తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలలకు పంపుతున్నారని, ఆ కుటుంబాలకు సంక్షేమ పథకాలు ఎందుకని ప్రశ్నించారు. వరంగల్ జిల్లా విశ్వనాథపురం, నందనాయక్‌తండా గ్రామ రైతు వేదికలో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
2,527 గిరిజన జనాభా ఉన్న గ్రామ పంచాయతీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు గిరిజనులకు అందాలనే లక్ష్యంతో కొత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులు తీసుకునే అనాలోచిత నిర్ణయాల వల్లే తమ పిల్లల చదువు, ఉద్యోగాలకు ఆటంకం కలిగించే అవకాశాలు ఉన్నాయని, వాటిని మానుకోవాలని సూచించారు. అనుమతి లేకుండా మద్యం విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు నిర్మూలన కోసం యువత ముందుకు రావాలని కోరారు.