KA Paul | పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ నేతలు తమకు ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీ వెళ్లిన కేఏ పాల్ అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయించే నేతలపై కోర్టులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా చేయాలని న్యాయస్థానాలను కేఏ పాల్ కోరారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు జీతాలు కూడా ఇవ్వకూడదని అన్నారు. అలా చేస్తేనే ప్రజాప్రతినిధులు పార్టీ మారేందుకు ఆలోచిస్తారని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం పార్టీ మారిన వారిని డిస్క్వాలిఫై చేయాలని కోరారు.
పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా కేఏ పాల్ ముందు నుంచే పోరాటం చేస్తున్నారు. పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ కూడా వేశారు. దానిపై శుక్రవారం విచారణ జరగ్గా.. నవంబర్ 4వ తేదీకి వాయిదా పడింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవంబర్ 4వ తేదీన తుది తీర్పు వస్తుందని భావిస్తున్నానని తెలిపారు. గతంలో బీఎస్పీ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించిన ఘటనలో ఇందిరా గాంధీపై అనర్హత వేటు పడిందని గుర్తు చేశారు. మరోసారి ఎవరూ పార్టీలు మారకుండా ఉండాలంటే ఈ ఎమ్మెల్యేలపై వేటు పడాలని అన్నారు.