హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ప్రజాపాలనకు వచ్చిన దరఖాస్తులు ఎలాంటి తప్పులు లేకుండా ఆన్లైన్లో నమోదు కావాలని మంత్రుల బృందం అధికారులను ఆదేశించింది. డాటాను సీజీజీతోపాటు ఐటీ, ఇతర శాఖలు పంచుకొని, ఏవైనా లోపాలు ఉంటే సవరించాలని సూచించింది. ప్రజాపాలనపై నియమించిన సబ్ కమిటీ శుక్రవారం సచివాలయంలో సమావేశమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సుమారు రెండున్నర గంటల పాటు సమావేశం కొనసాగింది.
ఈ సందర్భంగా ప్రజా పాలనలో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? డాటా ఎంట్రీ ఎంత వరకు పూర్తయింది? ఐదు గ్యారెంటీలకు సంబంధించి స్వీకరించిన దరఖాస్తుల్లో గ్యారెంటీ వారిగా వచ్చిన అభ్యర్థనలు ఎన్ని? తదితర అంశాలపై చర్చించారు. సీనియర్ అధికారులు ఐదు గ్యారంటీల అమలుకోసం యాక్షన్ ప్లాన్ చేయడానికి అభిప్రాయాలు తెలిపారు. ఐదు గ్యారెంటీల లబ్ధి పొందడానికి అసలైన దరఖాస్తుదారుల ఎంపిక విధానం గురించి మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాపాలన దరఖాస్తు డాటా సేకరణలో కానీ, ఎంట్రీలో కానీ ఎవరూ దరఖాస్తుదారులను ఓటీపీ అడగలేదని మంత్రులు స్పష్టం చేశారు. ఓటీపీ అనే అంశం దరఖాస్తులోనే లేదని, ఎవరైనా సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి దరఖాస్తుదారులను ఓటీపీ అడిగితే ఇవ్వవద్దని కోరారు. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ నేరస్తులు అడిగే ఓటీపీకి, ప్రజాపాలనలో సేకరించిన దరఖాస్తులకు సంబంధం లేదన్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఐదు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామన్నారు.