హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర కాంగ్రెస్‌లో తాజాగా నియమించిన వివిధ కమిటీల్లో ఉన్నత వర్గాలకే పెద్దపీట వేశారని, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలను విస్మరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్ ఎక్స్ వేదికగా విమర్శించారు. ఈ నియామకాలు సామాజిక న్యాయసూత్రానికి వ్యతిరేకంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. ఆ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్‌ను ఉల్లంఘిస్తూ, కులగణన స్ఫూర్తిపై ఘోరంగా దాడి చేసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ నినదించిన ‘జిత్నీ ఆబాదీ, ఉత్నా హక్’ ఆత్మ ఈ నియామకాలలో ఎకడ ఉన్నది? అని ప్రశ్నించారు.
తకువ వర్గాలను వ్యవస్థాపితంగా అణిచివేయడమే కాకుండా, వారి రాజకీయ శక్తిని పూర్తిగా నిరాకరించారని పేర్కొన్నారు. మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించలేదని ధ్వజమెత్తారు. ‘రాష్ట్ర ఆర్థిక కమిషన్, వ్యవసాయ కమిషన్ లాంటి రాజ్యాంగ పదవులు అనుభవిస్తున్న కొందరు నేతలనే తిరిగి పార్టీ కమిటీలలో కీలక పదవుల్లో నియమించడం చట్టరీత్యా పెద్ద తప్పిదమని తెలిపారు. సబ్బండ వర్ణాలకు ఆయా కమిటీల్లో ప్రాతినిధ్యం ఎకడా కనిపించడంలేదని విమర్శించారు. ఈ కాంగ్రెస్ కమిటీ నియామకాలు పొరపాటుగా జరిగినవి కాదని, కావాలనే బహుజన వర్గాలను అణిచివేయడం కోసమేనని, సామాజిక న్యాయాన్ని గంగలో కలిపేసిన చర్య అంటూ ఆయన దుయ్యబట్టారు.