Rythu Bharosa | హైదరాబాద్, డిసెంబర్ 28(నమస్తే తెలంగాణ): పంట సాగు చేసిన భూములకే పెట్టుబడి సాయం అందజేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టంచేశారు. ఈ పథకం అమలులో కచ్చితత్వం కోసం రిమోట్ సెన్సింగ్ (శాటిలైట్ సర్వే) చేస్తామని వెల్లడించారు. శనివారం ఆయన సచివాలయంలో సర్వే సంస్థలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన వివిధ కంపెనీల ప్రతినిధులు తాము చేపట్టిన ప్రాజెక్ట్‌ల వివరాలతోపాటు రెండు మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేసిన సర్వే వివరాలు, ఆయా గ్రామాలవారీగా ఇప్పటివరకు సాగు చేసిన భూముల వివరాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. సాగుకు అనువుగా లేని భూములను కూడా చూపించారు. అనంతరం సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధంగా ఉండాలని ఆయా కంపెనీలకు మంత్రి 2వ సూచించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. సాగులో ఉన్న భూమికి మాత్రమే పెట్టుబడి సాయం అందించాలనేదే తమ ముఖ్య ఉద్దేశమని తేల్చి చెప్పారు.
ఇందుకోసం సాగు చేసిన భూముల వివరాలను ఎప్పటికప్పుడు ఏఈవోల ద్వారా రైతుల వారీగా నమోదు చేస్తామని వెల్లడించారు. దీనితోపాటు పథకం అమలులో కచ్చితత్వం కోసం ఉపగ్రహ డాటా సహాయంతో గ్రామాల వారీగా, సర్వే నంబర్ల వారీగా సాగులో ఉన్న భూముల విస్తీర్ణం, సాగుకు అనువుగాని విస్తీర్ణంతోపాటు ప్రస్తుతం ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగైంది? తదితర వివరాలను నమోదు చేయనున్నట్టు తెలిపారు. ఈ సర్వే వివరాలను రైతుభరోసాతోపాటు భవిష్యత్‌లో చేపట్టనున్న పంటల భీమా పథకం అమలుకు వినియోగిస్తామని స్పష్టంచేశారు. అదే విధంగా పంటల ఆరోగ్యస్థితి, పంటల ఎదుగుదల, చీడపీడలను ఆరంభంలోనే గుర్తించడం, వరదలు, తుఫానుల వల్ల జరిగే పంటనష్టాన్ని అంచనా వేయడం తదితర అవసరాలకు వినియోగించుకుంటామని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి రఘునందన్‌రావు, డైరెక్టర్ గోపి పాల్గొన్నారు.