వరంగల్ చౌరస్తా, ఆగష్టు 19 : వరంగల్‌లోని కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీరు పేరుగొప్ప.. ఊరు దిబ్బ అన్నచందంగా తయారైంది. మౌలిక వసతుల విషయంలో అధ్వాన పరిస్థితి నెలకొన్నది. సోమవారం కురిసిన వర్షానికి హాస్పిటల్‌కు 3గంటల పాటు విద్యుత్తు అంతరాయం ఏర్పడి పూర్తిగా అంధకారంగా మారింది.
వెంటనే సిబ్బంది చర్యలు చేపట్టకపోవడంతో రోగులు, అటెండెంట్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించాల్సిన జనరేటర్‌కు ఇంధనం అందుబాటులో లేకపోవడంతో అది పనిచేయక వైద్యసేవలకు సైతం అంతరాయం కలిగింది. ఇకనైనా అధికారులు మౌలిక వసతులు మెరుగుపరచడంపై దృష్టిపెట్టాలని రోగులు, అటెండెంట్లు కోరుతున్నారు.