హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్మించబోయే విద్యుత్తు ఉత్పత్తి ప్రాజెక్టులన్నింటినీ జెన్కో ద్వారానే చేపట్టాలని విద్యుత్తు ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం జెన్కో సీఎండీ రిజ్వీని తన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యుత్తు ఉద్యోగులు సీఎండీ దృష్టికి పలు విషయాలు తీసుకెళ్లారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ట్రాన్స్‌కో, జెన్కో, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను ప్రభుత్వం రంగంలో కొనసాగించిందని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వం అన్ని థర్మల్ విద్యుత్తు, జల విద్యుత్తు, సోలార్ విద్యుత్తు ప్రాజెక్టులను జెన్కో ద్వారానే నిర్మించాలని కోరుతున్నట్టు తెలిపారు. సీఎండీ స్పందిస్తూ..విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ విజ్ఞప్తుల మేరకు జెన్కోకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకొంటామని హామీనిచ్చారు. సీఎండీని కలిసిన వారిలో తెలంగాణ విద్యుత్తు జేఏసీ నాయకులు వెంకటేశ్వర్లు, రత్నాకర్‌రావు, ప్రభాకర్‌గౌడ్, బీ సీ రెడ్డి, వజీర్, సీ సదానందం, కే కుమారస్వామి, సంపత్‌రెడ్డి, కుమారస్వామి, కరుణ్కర్ రెడ్డి, తులసీ నాగవాణి, నెహ్రూ, రామగుండం చెందిన శంకరయ్య, శ్రీనివాసు తదితరులు ఉన్నారు.