డీజిల్ ఇంజిన్లతో తోడి.. చేనుకు తడి
‘రాష్ట్రంలో విద్యుత్తు కోతలు లేవు.. రికార్డు స్థాయిలో డిమాండ్ ఉన్నా.. నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నాం.. వ్యవసాయానికి 8 నుంచి 9 గంటలు కూడా కరెంట్ లేదన్నది అవాస్తవం’ అని ఈనెల 7న డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ ప్రకటన చూస్తే ‘నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు’ అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని స్పష్టం అవుతున్నది.
- రోజుకు రూ.2వేలు ధారపోస్తేనే పొలానికి నీళ్లు
- 24 గంటల కరెంటుకు స్వస్తి పలికిన కాంగ్రెస్
- ఇస్తున్నది 4 గంటలు.. దాంట్లోనూ లోవోల్టేజీ
- సాగు కరెంటుకూ రోజూ 20సార్లు పవర్ట్రిప్
- పంటలు కాపాడుకునేందుకు రైతుల అగచాట్లు
- గంగాధర మండలంలో ఎండిన 4వేల ఎకరాలు
- నమస్తే తెలంగాణ క్షేత్ర పరిశీలనలో వెలుగులోకి..
(కడపత్రి ప్రకాశ్‌రావు) కరీంనగర్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/గంగాధర: ‘రాష్ట్రంలో విద్యుత్తు కోతలు లేవు.. రికార్డు స్థాయిలో డిమాండ్ ఉన్నా.. నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నాం.. వ్యవసాయానికి 8 నుంచి 9 గంటలు కూడా కరెంట్ లేదన్నది అవాస్తవం’ అని ఈనెల 7న డిప్యూటీ సీఎం, విద్యుత్తు శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ ప్రకటన చూస్తే ‘నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు’ అన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని స్పష్టం అవుతున్నది. రోజుకు నాలుగు గంటలకు మించి కరెంట్ రావడం లేదని, అందులోనూ లో ఓల్టేజీ సరఫరా, 20కిపైగా సార్లు ట్రిప్ (వచ్చుకుంటూ పోవడం) అవుతుందంటూ అన్నదాతలు గగ్గోలు పెడుతుంటే.. సరిదిద్దాల్సిన సర్కార్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. దీంతో బావుల్లో నీళ్లున్నా మొదటి మడి దాడటం లేదు.
ప్రభుత్వ అసమర్థత కారణంగా వేలాది ఎకరాల్లో వరి పొట్టదశలో ఎండిపోతున్నది. చేతికొచ్చిన పంటలు కండ్లముందే చేజారిపోతుంటే అన్నదాతల గుండెలు అవిసిపోతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు నానా కష్టాలు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఆయిల్ ఇంజిన్ జనరేటర్లు వాడుతున్నారు. దీంతో వాటి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. కేసీఆర్ పాలనలో కనురెప్ప పాటు కూడా కరెంట్ పోలేదని.. కానీ కాంగ్రెస్ పాలనలో కనురెప్పను కూడా వాల్చనీయడం లేదని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
సాగు నీటి రంగానికి సరఫరా అవుతున్న విద్యుత్తు విషయంలో ప్రభుత్వం చెప్తున్న మాటలకు, క్షేత్రస్థాయిలో సరఫరా అవుతున్న తీరును పరిశీలించేందుకు ‘నమస్తే తెలంగాణ’ ఓ గ్రామాన్ని యూనిట్‌గా ఎంచుకొని పరిశీలించింది. అక్కడ కండ్లు బైర్లు కమ్మే వాస్తవాలు బయటికి వచ్చాయి. అరకొరగా విద్యుత్తు సరఫరా, పదుల సార్లు ట్రిప్ అవడం, లో ఓల్టేజీతో కాలిపోతున్న మోటర్లు, పంటలు కాపాడుకునేందుకు జనరేటర్ల వినియోగం.. ఇలా అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావు. అన్నం ఉడికిందా.. లేదా? అని చెప్పడానికి ఒక మెతుకు చాలన్నట్లుగా.. ప్రభుత్వం పనితీరుకు ఈ గ్రామమే ఒక ఉదాహరణ.

గంపెడు కష్టాల్లో ‘గర్శకుర్తి’ రైతులు
‘నమస్తే తెలంగాణ’ బృందం పరిశీలనకు ఎంచుకున్న గ్రామం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి. ఈ రెవెన్యూ గ్రామ పరిధిలో 1113 మంది రైతులు ఉండగా, 1850 ఎకరాల్లో వరి, 370 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. గ్రామ పరిధిలోని 750 బావులతోపాటు పక్కనే ఉన్న వరదకాలువ నుంచి సొంత మోటర్ల ద్వారా ఎత్తిపోసే నీటిపై ఆధారపడి రైతులు పంటలు సాగు చేస్తున్నారు. బావుల్లో నీళ్లున్నాయి. కానీ, కరెంట్ నాలుగు గంటలు కూడా రావడం లేదు. వచ్చే నాలుగు గంటల్లో సుమారు 20 సార్లు ట్రిప్ అవుతున్నది.
అందులోనూ లో ఓల్టేజీ సరఫరా అవుతున్నది. దీంతో మోటర్ల ద్వారా ఎత్తిపోసే నీరు మొదటి మడి దాటడం లేదు. ఇప్పటికే దాదాపు 600 ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. లో ఓల్టేజీ కరెంట్ వల్ల ఇప్పటికే ఈ గ్రామంలో వందకుపైగా మంది రైతుల మోటర్లు కాలిపోయాయి. పొట్టదశకు వచ్చిన పంటను కాపాడుకునేందుకు రైతులు అగచాట్లు పడుతున్నారు. చివరికి కొంతమంది రైతులు ఆయిల్ జనరేటర్లు తెప్పించి, వాటి ద్వారా పంటలు కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ కష్టాలు ఒకనాటి సమైక్య పాలనలోని కష్టాలను గుర్తుకు తెస్తున్నాయని అన్నదాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ జనరేటర్ల కాలం వచ్చిందని, వాటి ఖర్చు తడిసి మోపెడవుతున్నదని పేర్కొంటున్నారు. రోజుకు రూ.2వేలు అద్దె, రూ.వెయ్యి వరకు డిజిల్ పోయాల్సి వస్తున్నదని వాపోతున్నారు. మొత్తంగా రోజుకు రూ.3వేల వరకు ఖర్చు అవుతుండటంతో అన్నదాతల గుండెలు గుభేలుమంటున్నాయి. పొట్టకొచ్చి పాలు పోసుకుంటున్న వరి కండ్ల ముందే ఎండిపోతుంది, కాపాడుకుందామంటే మోయలేనంత ఖర్చు అవుతుండటంతో ముందు నుయ్యి, వెనుక గొయ్యి మాదిరిగా కన్నీరుమున్నీరవుతున్నారు.

ఇరువై రోజులుగా జనరేటర్తోనే
నేను ఆరెకరాల్లో వరి ఏసిన. పది నిమిషాలకోసారి కరెంట్ బంద్ చేస్తున్నరు. పైపులు సదిరే వరకే కరెంటు పోతున్నది. గుంట పొలం కూడా సక్కగ పారుతలేదు. అందుకనే 20రోజుల కింద జనరేటన్ తెచ్చిన. రోజుకు రూ.2 వేల కిరాయి. ఇప్పటికే 40 వేల కిరాయి అయ్యింది. డీజిల్‌కు రోజుకు రూ.900 ఖర్చు అయితున్నది. నెల రోజులకు దగ్గరదగ్గర రూ.లక్ష ఖర్చు అయితున్నది. ఎవుసానికి పెట్టిబడి రూ.2.50 లక్షల దాక అయ్యింది. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకొని, కోతలు లేకుంట కరెంటు ఇచ్చి పంటలను కాపాడాలే.
– రామిడి మల్లయ్య, రైతు (తాడిజెర్రి)
గర్శకుర్తి మాత్రమే కాదు..
ఇది కేవలం గర్శకుర్తి కథ మాత్రమే కాదు. గర్శకుర్తి క్లస్టర్ పరిధిలోని తాడిజెర్రి, ఆచంపల్లి, చిన్నాచంపల్లి, హిమ్మత్‌నగర్, కాసారం, కురిక్యాల క్లస్టర్ పరిధిలోని రంగరావుపల్లి, ఉప్పరమల్యాల, వెంకంపల్లి గ్రామాల్లోనూ ఇదే దుస్థితి నెలకొన్నది. ఆచంపల్లి విద్యుత్తు సబ్‌స్టేషన్ పరిధిలో 780 విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లు ఉండగా, 3350 కరెంటు మోటర్లు ఉన్నాయి. సబ్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల్లో 6961 మంది రైతులు 8004 ఎకరాల్లో వరి, 2655 ఎకరాల్లో పత్తి, 100 ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేశారు.
ఇందులో సుమారు వేయి ఎకరాల్లో ఇప్పటికే పంటలు ఎండిపోయాయి. కరెంటు పరిస్థితి ఇలాగే ఉంటే మరో వారం రోజుల్లో మరో వేయికిపైగా ఎకరాల్లో పంటలు ఎండిపోతాయని రైతులు చెప్తున్నారు. అంతేకాదు, గంగాధర మండలం మొత్తం తీసుకుంటే 4 వేల ఎకరాలకుపైగా వరి ఎండిపోయింది. తీవ్రమైన విద్యుత్తు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని, లో ఓల్టేజీతో సమస్యతో కరెంటు మోటర్లు కాలిపోతున్నాయని, ఆచంపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని రైతులు ఇప్పటికే రెండు మూడుసార్లు పురుగుమందు డబ్బాలతో సైతం అందోళన చేశారు. కానీ ఎలాంటి మార్పు మాత్రం రాలేదు.

మళ్లీ సమైక్య పాలన చీకట్లు
ప్రస్తుత సాగునీటిరంగ స్థితిని చూస్తుంటే సమైక్య పాలననాటి చీకట్లు కమ్ముకున్నట్టు స్పష్టం అవుతున్నది. నాడు కరెంట్ సరఫరా లేక రైతాంగం అల్లాడగా, మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అంతకు మించి ఇబ్బందులు పడుతున్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కరెంట్ కష్టాలను తొలగించి, సాగునీటిరంగానికి 24 గంటల కరెంట్ సరఫరా చేసిన సంగతి తెలిసిందే. కానీ కాంగ్రెస్ పాలనలో తలకిందులయ్యింది. వ్యవసాయరంగానికి 12 నుంచి 14 గంటల పాటు నిరంతర సరఫరా చేస్తున్నామంటూ ప్రభుత్వం గొప్పలు చెప్తున్నది. కానీ, క్షేత్రస్థాయిలో నాలుగు గంటలకు మించి సరఫరా కావడం లేదు. అందులోనూ లో ఓల్టేజీ రావడంతో చాలా మోటర్లు కాలిపోతున్నాయి.
వచ్చే నాలుగు గంటల్లోనూ సుమారు 20కిపైగా సార్లు కరెంట్ ట్రిప్ అవుతున్నదని రైతులు చెప్తున్నారు. ట్రిప్ అయి తిరిగి తిరిగి వచ్చిన ప్రతిసారి మళ్లీ మోటర్లు ఆన్ చేయాల్సిందేనని, దీంతో అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సి వస్తున్నదని రైతులు చెప్తున్నారు. ‘ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ పాలనలో రెప్పపాటు కూడా కరెంటు పోలేదు. కానీ, ఇప్పుడు రైతన్న రెప్ప మూయలేని దుస్థితి దాపురించింది’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అనేక సార్లు ట్రిప్ అవుతూ పంపులు నడుస్తుండటంతో ఎత్తిపోసిన నీళ్లు మొదటి మడి దాడటం లేదన్నారు. మెటార్లను బాగుచేయడానికి హెచ్‌పీలను బట్టి రూ.4వేల నుంచి రూ.12వేల వరకు వెచ్చించాల్సి వస్తున్నది. కనీసం లోవోల్టేజీ, ట్రిప్ కాకుండా చూడాలని సబ్స్టేషన్ల వద్ద అధికారులను కోరితే.. అది తమ చేతిల్లో లేదని చెప్తున్నారని వాపోతున్నారు. అందుకే తమ గోడు సర్కార్‌కు వినపడేందుకు సబ్ష్టేషన్ల ఎదుట ఆందోళనకు దిగుతున్నారు.
కరెంట్ లేక పొలం ఎండిపోతున్నది
మా భూమితోపాటు పక్కనున్న ఎకరం పొలం కౌలుకు తీసుకుని సాగు చేసిన. వరి పొట్టదశలో ఉన్నది. పదిహేను రోజులు నీళ్లు అందితే బయట పడుతది. కానీ కరెంట్ సరిగా రాక పొలం ఎండిపోతున్నది. కనీసం నాలుగు గంటలు కూడా సక్కగ వస్తలేదు. జంపర్ల మీద వైరు తెగిందని, ట్రాన్స్ఫారం మీద వైరు తెగిందని, ఫీజు వైరు కొట్టేసిందని కరెంటు కట్ చేస్తున్నరు. అందుకే పొలాన్ని ఎట్లయినా కాపాడుకోవాలని రోజుకు రూ.2 వేలు కిరాయి ఇచ్చి జనరేటర్ తెచ్చిన. 30 లీటర్ల డీజిల్ పోస్తే 15 గంటలు నడిచింది.
-బూరుగు ఎల్లవ్వ, మహిళా రైతు (గర్శకుర్తి)

15 రోజులుగా మోటర్లు పోస్తలెవ్వు
నాకున్న నాలుగెకరాల్లో పొలం సాగు చేసిన. కరెంటు కోతలతో రెండెకరాలు కూడా పారుతలేదు. లో ఓల్టేజీతో 15 రోజులుగా మోటర్లు నీళ్లు పోస్తలెవ్వు. గంట కరెంట్ ఇత్తే మళ్లీ గంట ఫీజు కొట్టేస్తది. లేకుంటే వైర్లు తెగినయని కరెంట్ బంద్ పెడ్తున్నరు. మళ్లీ కరెంట్ వచ్చేవరకు పొలంలో నీళ్లు ఇంకిపోతయి. కరెంట్ రాదని జనరేటర్ కిరాయికి తెచ్చిన. రోజుకు రూ.2 వేలు కిరాయి. ఇప్పటికే డీజిల్‌కు రూ.7 వేలు ఖర్చు అయ్యింది. కేసీఆర్ సారు ఉన్నప్పుడు గిట్ల కాలేదు. మస్తు నీళ్లు, 24 గంటల కరెంట్ ఉండేది. రంది లేకుంట ఎవుసం జేసుకున్నం. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ వచ్చినంక కష్టాలు పడుతున్నం.
– పుల్కం మల్లేశం, రైతు (గర్శకుర్తి)
వరికి ఆరుతడులు పెడుతున్నా
ఎనిమిది ఎకరాల్లో వరి వేసిన. కరెంట్‌తో చాలా ఇబ్బంది అయితున్నది. పొద్దంతా ఉంటలేదు. గంట ఇస్తే మల్లా కోతలు పెడుతున్నరు. రెండు ఎకరాలు కూడా పారుతలేదు. పొలాన్ని కాపాడుకోవడానికి పత్తికి, మక్కకు పెట్టినట్టు రోజు విడిచి రోజు ఆరుతడులు పెడుతున్నం. లాగోడి కూడా వచ్చేటట్టు లేదు. రూ.3 లక్షలు మునిగినట్టే. రోజుకు మూడు నాలుగు గంటల కంటె కరెంటు ఎక్కువ ఉంటలేదు. లో ఓల్టేజీతో ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్ మోటర్లు కాలిపోతున్నయి. కేసీఆర్ సారు ఉన్నప్పుడు 24 గంటలు ఇచ్చిండు. మరి ఇప్పుడు రేవంత్‌రెడ్డి ఎందుకు ఇస్తలేడు? రైతుల మీద ప్రేమ, కరెంటు మీద అవగాహన ఉంటేనే సాధ్యమైతది.
– పెరుక శ్రీనివాస్, రైతు (తాడిజెర్రి)

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

