హైదరాబాద్, అక్టోబర్ 14(నమస్తే తెలంగాణ): వేసవికి ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే కరెంటు కోతలు మొదలు కావడంతో పారిశ్రామిక వర్గాల్లో ఆందోళన మొదలైంది. సమయం, సందర్భం లేకుండా గంటల తరబడిపోతున్న కరెంటు పరిశ్రమల యజమానులను కలవరపెడుతున్నది. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జనరేటర్ల వాడకం లేకపోవడంతో అవి తుప్పుపట్టిపోయాయి. ప్రస్తుత పరిస్థితి ఇలానే కొనసాగితే వాటికి మరమ్మతు చేసుకోవాల్సి వస్తుందని చెప్తున్నారు. పరిశ్రమ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. చర్లపల్లిలో ఆదివారం రాత్రి రెండు గంటలకుపైగా కరెంటు లేదు. బాలానగర్‌లో గత వారం వరుసగా మూడు రోజులు మధ్యాహ్న సమయాల్లో మూడు నుంచి నాలుగు గంటలపాటు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
దండు మల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్‌లో గత మూడు నెలలుగా తరచూ గంట నుంచి రెండు గంటలపాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోతున్నది. నాచారం, మల్లాపూర్, ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాల్లోనూ ఇదే పరిస్థితి. సహజంగా అధిక వర్షాలు, గాలిదుమారం వచ్చినప్పుడు, లేదంటే మెయింటెనెన్స్ పనుల సందర్భంగా విద్యుత్తు సరఫరాను నిలిపివేయడం, అనంతరం పునరుద్ధరించడం పరిపాటి. అయితే, వాతావరణం పొడిగా ఉన్న రోజుల్లో సైతం కరెంటు పోతున్నదని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. అప్రకటిత కోతల వల్ల ఉత్పత్తులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతున్నదని కంపెనీల యజమానులు వాపోతున్నారు. అకస్మాత్తుగా కరెంటు పోవడం వల్ల ప్లాస్టిక్ పరిశ్రమలకు ఆపార నష్టం వాటిల్లుతున్నదని, ప్లాస్టిక్ చాలా వృథా అవుతున్నదని పేర్కొన్నారు. ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు సహా బాయిలర్లతో పనిచేసే అన్నిరకాల పరిశ్రమలపై దీని ప్రభావం పడుతున్నది. తరచూ విద్యుత్తు సరఫరా నిలిచిపోవడం వల్ల విద్యుత్తు పరికరాలు కాలిపోవడం, కరెంటు బిల్లులు ఎక్కువ రావడం వంటివి జరుగుతున్నాయి.
విద్యుత్తు పరికరాల కొరతతో ఇబ్బందులు
ఫ్యూజులు పోవడం, ట్రాన్స్ఫార్మర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడం వంటి కారణాలతో తరచూ విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నది. ఉదాహరణకు ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్తును సరఫరా చేసేందుకు సీటీపీటీ (కరెంట్ ట్రాన్స్ఫార్మర్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్) జంక్షన్ బాక్స్ ఎంతో కీలకం. విద్యుత్తు శాఖే దీనిని సరఫరా చేస్తుంది. ప్రైవేటుగా కొనుగోలు చేసి ఉపయోగించే వీలులేదు. ఒకవేళ ఎక్కడైనా ట్రాన్స్ఫార్మర్ నుంచి కరెంటు సరఫరా నిలిచిపోతే విద్యుత్తుశాఖకు చెందిన సిబ్బంది వచ్చి దానిని మార్చే వరకు సరఫరాను పునరుద్ధరించే వీలులేదు. ఈ సీటీపీటీ జంక్షన్ బాక్స్‌లు విద్యుత్తుశాఖ వద్ద నిల్వలేవని అధికారవర్గాలు తెలిపాయి.
ట్రాన్స్ఫార్మర్లు పాతవైపోవడం వల్ల తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిని మరమ్మతు చేసేందుకు, చిన్నాచితకా పరికరాలు మార్చేందుకు విద్యుత్తు శాఖ వద్ద పరికరాల నిల్వలేదని చెప్తున్నారు. దీనివల్ల తరచూ సమస్యలు తప్పడంలేదని పేర్కొంటున్నారు. నిధుల కొరత కారణంగా కొంతకాలంగా పరికరాల కొనుగోలు నిలిచిపోయిందని, దీనివల్ల చిన్నచిన్న పరికరాలు మార్చాలన్నా ఎంతో సమయం పడుతున్నదని విద్యుత్తుశాఖ అధికారులు తెలిపారు. కొన్ని సందర్భాల్లో పరిశ్రమల వాళ్లనే ఆయా పరికరాలు తెచ్చుకోవాలని సూచిస్తున్నారు.
పదేండ్లు కొరతలేకుండా పరికరాల సరఫరా
దాదాపు పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్తు సరఫరాకే కాదు, పరికరాలకు కూడా ఏనాడూ కొరత రాలేదని, అటు పరిశ్రమ వర్గాలు, ఇటు విద్యుత్తు శాఖ సిబ్బంది చెప్తున్నారు. సమస్యలు తలెత్తకుండా రెగ్యులర్ మెయింటెనెన్స్ ఉండేదని, అనుకోకుండా ఎక్కడైనా ఫెయిల్యూర్ సంభవించినా వెంటనే మరమ్మతులు పూర్తిచేసే వారని గుర్తుచేస్తున్నారు. పరిశ్రమల యజమానులు ట్రాన్స్ఫార్మర్లను ప్రైవేటుగా కొనుగోలు చేసుకుంటుండగా, సీటీపీటీ సహా వాటికి ఏర్పాటుచేసే పరికరాలను విద్యుత్తు శాఖ నుంచే సరఫరా చేసే వారు. వాటికి మరమ్మతులు చేయాలన్నా, మార్చి కొత్తవి ఏర్పాటు చేయాలన్నా విద్యుత్తు శాఖ సిబ్బందే చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆ శాఖ ఏ విధమైన పరికరాలనూ కొనుగోలు చేయలేకపోతున్నదని, దీనివల్ల ఎక్కడ ఫెయిల్యూర్స్ ఏర్పడినా మరమ్మతులు చేసేందుకు ఎంతో జాప్యం జరుగుతున్నదని అధికారులు చెప్తున్నారు. ఫెయిల్యూర్స్‌కి నిర్వహణ లోపం ప్రధాన కారణమని వివరించారు.