కరీమాబాద్, ఏప్రిల్ 29 : మంత్రులు పాల్గొన్న సభలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఒక్కసారిగా చీకటిమయం కావడం తో మంత్రి అసహనం వ్యక్తంచేశారు. వరంగల్ జిల్లా ఉర్సు బైపాస్ రోడ్డులోని నాని గార్డెన్లో మంగళవారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖతోపాటు అధికారులు సభా వేదికపై ఉండగానే విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. చీకటిమయం కావడంతో అధికారులు హైరానాపడ్డారు. వెంటనే జనరేటర్ ఆన్‌చేసి కార్యక్రమం కొనసాగించాల్సి వచ్చింది. విద్యుత్తు అధికారులు వచ్చి సరఫరాను పునరుద్ధరించారు. కాగా, ఈ సభ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని తలపించింది. ఇద్దరు మంత్రులు, జిల్లా అధికారులు పాల్గొన్న కార్యక్రమంలో సభా వేదికపై కాంగ్రెస్ నాయకులు కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది. అధికారిక కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఫొటో లేకుండానే అధికారులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందే వరంగల్ తహసీల్దార్ ఇక్బాల్ రాజకీయ ప్రసంగం చేయగా, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అతడికి చురకలు అంటించారు. అధికారులు రాజకీయాలు మాట్లాడొద్దని, తాము మాట్లాతామని సూచించారు.