హిమాయత్‌నగర్, ఏప్రిల్ 14: నాదర్గుల్ భూవివాదంపై సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ప్రజా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. ఈ మేరకు మంగళవారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్, వీ సంధ్య, రాష్ట్ర అధ్యక్షురాలు జీ అనసూయ, ఐఎఫ్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అనురాధ, పీవైఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం పరశురాం, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పీ మహేశ్ తదితరులు మాట్లాడుతూ.. నాదర్గుల్లోని సర్వే నంబర్ 613లోని 373.22 ఎకరాల భూమికి సంబంధించిన వివాదం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. కోహినూర్ గ్రూప్, ఇంప్లెక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి సంస్థలు ఈ భూములను ఆక్రమించి జాయింట్ వెంచర్‌గా కార్యకలాపాలు చేపడుతున్నట్టు ఆరోపించారు.
ఈ భూములను సాగుచేస్తూ సుమారు 600 కుటుంబాలకు చెందిన మూడుతరాల రైతులు జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు. ఈక్రమంలో భూముల చుట్టూ ప్రైవేట్ సంస్థలు కంచెలు వేస్తూ రైతుల బోరుబావులను ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి, ప్రైవేట్ సంస్థలకు మధ్య లోపాయికారి ఒప్పందంతో పేదల బతుకులు రోడ్డున పడుతున్నాయని, వేల కోట్ల విలువైన భూములను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.
2007లో రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి రామకృష్ణ రాజు ఆధ్వర్యంలో జరిగిన న్యాయ విచారణ రైతులకు అనుకూలంగా ఉందని, ఆ నివేదిక అందుబాటులో లేదని అధికారులు చెబుతున్నారని, దానిని బయటపెడితే వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. ప్రైవేట్ కంపెనీల ఆక్రమణలు తొలగించాలని, అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగితే వాటిపై విచారణ జరుపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.