హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ‘ఆరోగ్యశ్రీ’ సేవలను నిలిపివేయాలన్న నిర్ణయాన్ని నెట్వర్క్ దవాఖానలు తాత్కాలికంగా వాయి దా వేసుకున్నాయి. పెండింగ్ బకాయిలను చెల్లించకపోవడంతో శనివారం అర్ధరాత్రి నుంచి ‘ఆరోగ్యశ్రీ’ సేవలను నిలిపివేయనున్నట్టు నెట్వర్క్ దవాఖానలు ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రూ.1,400 కోట్ల బిల్లులు చెల్లించకపోవడంతో నెట్వర్క్ దవాఖానలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో ‘ఆరోగ్యశ్రీకి డబ్బుల్లేవ్’ అనే శీర్షికతో ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
మరోవైపు ‘ఆరోగ్యశ్రీ’ పెండింగ్ బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆదివారం జరిగిన అసెంబ్లీలో డిమాండ్ చేశారు. దీంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఓ వైపు అసెంబ్లీ జరుగుతుండగానే ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయం నుంచి అధికారులు తనకు ఫోన్ చేశారని, ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతున్నందన పెండింగ్ బిల్లుల అంశంపై సోమవారం చర్చలకు రావాలని ఆహ్వానించారని ‘ఆరోగ్యశ్రీ’ నెట్వర్క్ దవాఖానల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వడ్డిరాజు రాకేశ్ వెల్లడించారు.
దీంతో వెంటనే నెట్వర్క్ దవాఖానల అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించి ప్రభుత్వ ప్రతిపాదనపై చర్చించామని, ‘ఆరోగ్యశ్రీ’ సేవల నిలిపివేతను తాత్కాలికంగా వాయిదా వేసి, ప్రభుత్వానికి ఒక రోజు గడువు ఇవ్వాలని ఈ భేటీలో నిర్ణయించామని తెలిపారు. గతంలో ప్రభుత్వ హామీ మేరకు మానవీయ కోణంలో ప్రజలకు ‘ఆరోగ్యశ్రీ’ సేవలను కొనసాగించామని, ఈసారి మాత్రం సేవలను కొనసాగించడం కుదరదని ప్రభుత్వానికి తేల్చిచెప్పామని ఆయన స్పష్టం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో ‘ఆరోగ్యశ్రీ’ నెట్‌వర్క్‌లోని అనేక దవాఖానల మనుగడ కష్టంగా మారిందని, కొన్ని దవాఖానలను మూసుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని ఆయన పేర్కొంటూ.. ప్రభుత్వంతో చర్చల అనంతరం పూర్తి కార్యాచరణ వెల్లడిస్తామని చెప్పారు.
హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్టు కాంగ్రెస్ నేతలు పదేపదే చెబుతున్నారని, పరిధిని పెంచడం కాద ని.. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ డిమాండ్ చేశారు. ఆదివారం అసెంబ్లీలో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్-2002 రిపీల్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యశాఖ మంత్రి ఏ బిల్లు తెచ్చినా బీఆర్ఎస్ తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు వెల్లడించారు.
ఆదివారం ఉదయం నుంచే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయని తెలిపారు. ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ గురించి చర్చిస్తున్న సందర్భంగా అన్ని ప్రైవేట్ హాస్పిటళ్లు ఆరోగ్యశ్రీ కింద చికిత్స ఇచ్చేది లేదని చెబుతుంటే, ఇంకా ఈ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. అసెంబ్లీలో కాలుపెట్టిన రోజు నుంచి కోరుట్ల, మెట్పల్లి దవాఖానల్లో సమస్యలు ఉన్నట్టు చెప్పానని, 22 నెలల తర్వాత కూడా అవే సమస్యలు దర్శనమిస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
చాలా యేండ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో ‘మం చం పట్టిన మన్యం’ అనే వార్త చూశానని, చిన్నప్పుడు చూసిన ఘటనలు మళ్లీ పునరావృతం కావడం తనను కలిచివేసిందన్నారు. కొన్ని ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ బీపీ గోలీలు కూడా అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తంచేశారు. జనగామలో సీటీస్కాన్ మిషన్ వచ్చి మూడు నెలలైనా కనీసం ఇన్స్టాల్ చేసి సేవలు ప్రారంభించలేదని పేర్కొన్నారు. ప్రభుత్వ దవాఖానల బలోపేతంపై ఆలోచించాలని ప్రభుత్వానికి సూచించారు.