హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో భానుడి భగభగల నేపథ్యంలో ఇంటర్ కాలేజీల రీ ఓపెన్‌ను వాయిదా వేయాలని అధ్యాపక సంఘాలు కోరుతున్నాయి. సోమవారం నుంచి కాలేజీలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా, ఇప్పుడే కాలేజీలు తెరువవద్దని కోరుతున్నాయి.
కాలేజీల రీ ఓపెన్‌ను ఈ నెల 8కి వాయిదావేయాలని ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పీ మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భరించలేని ఎండలున్నాయని, వారం రోజులు సెలవులు పొడిగించాలని కోరారు. మైనారిటీ లెక్చరర్స్ ఫోరం అధ్యక్షుడు సయ్యద్ జబీ, తెలంగాణ గెజిటెడ్ లెక్చరర్స్ అసోసియేషన్ నేతలు సైతం కాలేజీల రీ ఓపెన్‌ను వాయిదా వేయాలని కోరారు.