హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఆర్ఆర్బీ పరీక్షల నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షలను వాయిదావేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. ఒకే సమయంలో రెండు పరీక్షలుండటంతో ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో గ్రూప్-2 పరీక్షలను డిసెంబర్ 15, 16న నిర్వహించనున్నారు. డిసెంబర్ 16న ఆర్ఆర్బీ జూనియర్ ఇంజినీర్ పరీక్షను నిర్వహించనున్నారు. ఒకే రోజు రెండు పరీక్షలుండటంతో, రెండింటికి దరఖాస్తు చేసుకున్నవారికి నష్టం కలగనుంది. దీంతో గ్రూప్-2 పరీక్షను వాయిదావేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. నిరుద్యోగులు సోమవారం టీజీపీఎస్సీ చైర్మన్ డాక్టర్ ఎం మహేందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ఆర్ఆర్బీ పరీక్షను జాతీయంగా నిర్వహించనున్నడటంతో, రాష్ట్రప్రభుత్వం గ్రూప్-2ను వాయిదావేయాలని వినతిపత్రంలో కోరారు.
రెండింటికి హాజరయ్యే అవకాశమివ్వండి
రెండు పరీక్షలను ఒకే రోజు నిర్వహించనుండటంతో రెండింటిని రాసేవారు ఏదో పరీక్షను వదులుకోవాల్సి వస్తున్నది. రెండు పరీక్షలకున్న ప్రాముఖ్యాన్ని గుర్తించి, నిరుద్యోగ యువతకు రెండు పరీక్షలకు హాజరయ్యే అవకాశం కల్పించాలని కోరుతున్నాం. ఆర్ఆర్బీ పరీక్షలు ముగిసిన వెంటనే గ్రూప్-2 పరీక్షలను నిర్వహించినా అభ్యంతరం లేదు. మానవతా కోణంలో ఆలోచించి ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం.
– బీ గౌతమి, అభ్యర్థి
డిసెంబర్ చివరలో నిర్వహించండి
గ్రూప్-2 పరీక్షలను నెలలకొద్ది వాయిదావేయాలని కోరడంలేదు. ఆర్ఆర్బీ పరీక్షలుండటంతో రెండు, మూడు వారాలు మాత్రమే వాయిదా వేయమంటున్నాం. డిసెంబర్ చివరలో పరీక్షలు నిర్వహిస్తే ఇబ్బందులుండవు. ఇప్పటికే హడావుడిలో గ్రూప్-1 పరీక్షలను అభ్యర్థులు సజావుగా రాయలేకపోయారు. గ్రూప్-2 పరీక్షలపై చివరి వరకు లాగకుండా, త్వరగా నిర్ణయం తీసుకుంటే అభ్యర్థులకు ఉపశమనం కలుగుతుంది.
– జనార్దన్, నిరుద్యోగ జేఏసీ నేత