హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జూన్ 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష వాయిదా వేయాలని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. గ్రూప్-1 నిర్వహించే రోజే.. ఇంటెలిజెన్స్ బ్యూరో పరీక్ష కూడా ఉందని గుర్తు చేశారు. చాలా మంది అభ్యర్థులు ఐబీ పరీక్షకు కూడా హాజరవుతారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు (ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్ శాఖ) లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నాలుగు నెలల నుంచి విధులు నిర్వహించారని తెలిపారు. దీంతో వారంతా ప్రిపేర్ కావడానికి అవకాశం లేకుండా పోయిందని వాపోయారు. ప్రిపేర్ కావడానికి కనీసం నెల రోజుల సమయం ఇచ్చి, ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలని కోరారు. గ్రూప్-1 అభ్యర్థులకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ టీఎస్పీఎస్సీని కోరారు. కాగా, పలు ప్రభుత్వ శాఖలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరింగ్ (ఏఈఈ) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు వెంటనే నియామకపత్రాలు జారీ చేసి, వారికి న్యాయం చేయాలని సర్వీస్ కమిషన్‌ను కోరారు. 2017 పీఈటీ అభ్యర్థుల సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలని పేర్కొన్నారు.
టీచర్ల సమస్యలపై ఎందుకింత నిర్లక్ష్యం
ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మండిపడ్డారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వారికి బదిలీలు, పదోన్నతులు కల్పించాలని కోరారు. టీచర్లు పదే పదే హైకోర్టుకు వెళ్లకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి, న్యాయపరమైన చిక్కులు లేకుండా బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ ప్రకటించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందని తెలిపారు.
మూడు వారాలు వాయిదావేయండి: బస్సు యాత్ర కన్వీనర్
గ్రూప్-1 ప్రిలిమినరీని మూడు వారాల పాటు వాయిదా వేయాలని నిరుద్యోగుల బస్సు యాత్ర కన్వీనర్ జనార్ధన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియాసమావేశంలో ఆయన మాట్లాడారు. సార్వత్రిక, ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల షెడ్యూల్‌తో వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు విధుల్లో పాల్గొన్నారని తెలిపారు. దీంతో వారు గ్రూప్-1 పరీక్షలకు సరిగా సన్నద్ధం కాలేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయాలని కోరారు. సమావేశంలో ఇంద్రకుమార్, అశోక్ పాల్గొన్నారు.
నేటి నుంచి గ్రూప్-1 హాల్‌టికెట్ల పంపిణీ
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 9న నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జూన్ 1న మధ్యాహ్నం 2 గంటల నుంచి అధికారిక వెబ్సైట్ tspsc.gov.inలో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయని టీఎస్పీఎస్సీ పేరొంది. జూన్ 9న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రూప్-1 ప్రిలిమనరీ పరీక్షకు 4.03 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని 563 పోస్టుల భర్తీ కోసం గత ఫిబ్రవరిలో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేయగా, ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అక్టోబర్ 21 నుంచి మెయిన్ పరీక్షలను నిర్వహించడం కోసం ఇప్పటికే టీఎస్పీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది.