హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్త తెలంగాణ): గురుకుల పీఈటీ పోస్టులకు ఎంపికైన మహిళలకు బాలురు గురుకులాల్లో పోస్టింగ్‌లు ఇచ్చి అడ్డదిడ్డ నిర్ణయాలు తీసుకున్నారని టీజీపీఎస్సీ అధికారులపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వీస్ కమిషన్ చేసిన తప్పులకు తాము బలి కావాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు. బాలికల గురుకులాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ అక్కడ పురుషులకు పోస్టింగ్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పురుషులను బాలుర గురుకులాలకు, మహిళలను బాలికల గురుకులాల్లోని పీఈటీ పోస్టులకు ఎంపిక చేయాలన్న అంశం తెరపైకి వచ్చింది. ఈ విషయమై ప్రతి రోజు టీజీపీఎస్సీ కార్యాలయం చుట్టూ బాధిత అభ్యర్థులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎనిమిదేండ్ల క్రితం విడుదలైన పీఈటీ పోస్టుల భర్తీకి ఎంపికైన అభ్యర్థులలో చాలామంది ఇతర ఉద్యోగాలకు వెళ్లిపోయారు. అభ్యర్థులు లేకపోవడంతో రిలింక్విష్మెంట్ ఆప్షన్‌కు అవకాశం ఇచ్చి, ప్రక్రియను సైతం పూర్తి చేశారు. అయినా ఇంతవరకు పోస్టింగ్ ఆర్డర్లు సరి చేసి ఇవ్వలేదని బాధిత పీఈటీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీజీపీఎస్సీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అయినప్పటికీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పందించలేదు.