హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్ శాఖలో సీనియారిటీతో సంబంధం లేకుండా పోస్టింగ్‌ల ప్రక్రియ ఇష్టానుసారం కొనసాగుతున్నది. ఇటీవల ఇచ్చిన ప్రమోషన్లలో పలు అక్రమాలు జరిగినట్టు ఆరోపణలొచ్చాయి. తాజాగా మరో జూనియర్ డిప్యూటీ ఈఈని ఇన్చార్జ్ ఈఈగా నియమించేందుకు యత్నిస్తుండటం, అందుకు జోరుగా పైరవీలు కొనసాగుతుండటం జలసౌధవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు మహదేవపూర్ డివిజన్-1 డీఈఈగా 2007వ బ్యాచ్‌కు చెందిన సూర్యప్రకాశ్ కొనసాగుతున్నారు. గతంలో తన పలుకుబడిని ఉపయోగించి పలువురు ఉన్నతాధికారుల సహకారంతో మహదేవపూర్ డివిజన్-2 ఈఈగా పూర్తిస్థాయి బాధ్యతలను స్వీకరించారు. ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న 1999, 2004, 2005 బ్యాచ్‌లకు చెందిన సీనియర్ డీఈఈలను పక్కనపెట్టి ప్రభుత్వం 2007 బ్యాచ్‌కు చెందిన సూర్యప్రకాశ్‌కు ఈఈగా అదనపు బాధ్యతలను అప్పగించడం గమనార్హం.
మహదేవపూర్ డివిజన్-1లో డీఈఈగా కొనసాగుతూనే.. మహదేవపూర్ డివిజన్ -2కు కూడా ఫూర్తిస్థాయి అడిషనల్ ఈఈగా కొనసాగారు. సదరు డీఈఈపై అనేక ఆరోపణలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బరాజ్‌కు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికలో లెకకు మించి తప్పులున్నాయంటూ గత కొంతకాలంగా విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. మేడిగడ్డ బరాజ్ నిర్మాణం విషయంలో మొత్తం 25 మంది అధికారులు పనిచేసినట్టుగా విజిలెన్స్ విభాగం ముందుగా వివరాలు తీసుకున్నది. అందులో నలుగురిని మినహాయించి మిగతా వారిపై వివిధ రకాల కేసులు నమోదుచేసింది. విజిలెన్స్ విభాగం మినహాయించిన నలుగురు ఇంజినీర్లలో డీఈఈ సూర్యప్రకాశ్ ఉండటం గమనార్హం. బరాజ్ నిర్మాణానికి సంబంధించి రూ.220 కోట్ల పనులను ఈయన ఆధ్వర్యంలో చేశారు.
అయితే, విజిలెన్స్ నివేదిక నుంచి ఆయన పేరు లేకపోవడం వెనుక భారీ డీల్ కుదిరినట్టు అప్పట్లో ఆరోపణలొచ్చాయి. క్రిమినల్ కేసులు, భారీ పెనాల్టీలు లేకుండా విజిలెన్స్ విభాగంలోని ఓ అధికారి, ఇరిగేషన్ శాఖలోని మరో ఉన్నతాధికారితో కలిసి మేనేజ్ చేసుకున్నట్టు ఇంజినీర్లే బాహాటంగా చర్చించుకున్నారు. ఇదే విషయమై ‘విజిలెన్స్ రిపోర్ట్.. కరప్ట్?’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో గత ఆగస్టులో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఆ కథనం ఇరిగేషన్ శాఖతోపాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంలో సంచలనం రేపింది. కథనంలో ప్రతి వాక్యం నిజమేనని ధృవీకరించుకున్న ఉన్నతాధికారులు లోతుగా ఆరా తీశారు. ఆ తరువాత డీఈఈ సూర్యప్రకాశ్‌ను మహదేవ్పూర్ డివిజన్-2 ఈఈ బాధ్యతల నుంచి తప్పించారు. డివిజన్-1 డీఈఈగా కొనసాగించారు.
డీఈఈ కోసం ప్రమోషన్‌పై వచ్చిన ఈఈ బదిలీ
ప్రస్తుతం మళ్లీ మహదేవపూర్ డివిజన్-2కు పూర్తిస్థాయి అడిషనల్ ఈఈగా నియామకం పొందేందుకు సదరు డీఈఈ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వంలోని తనకు తెలిసిన పెద్దల చుట్టూ ప్రదక్షణ చేస్తున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఫైలు ఇరిగేషన్ శాఖ పెద్దలకు చేరిందని, నేడో, రేపో ఉత్తర్వులు వెలువడటమే తరువాయని విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే ఇన్‌చార్జ్‌ల పాలన ఉండకూడదనే ప్రభుత్వం గత సెప్టెంబర్‌లో 85 మంది డీఈఈలకు ఈఈ (ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు)గా ప్రమోషన్ కల్పించింది. అందులో భాగంగా మహదేవ్పూర్ డివిజన్-2 ఈఈగా రమేశ్‌బాబును సర్కారు నియమించింది.
అయితే, ప్రస్తుతం పైరవీలు చేస్తున్న సదరు డీఈఈ కోసం ప్రమోషన్‌పై వచ్చిన ప్రస్తుత ఈఈని బదిలీ చేసేందుకు రంగంసిద్ధమైనట్టు విశ్వసనీయ సమాచారం. సదరు ఈఈని ఎక్కడికి పంపించాలనేది కూడా సదరు డీఈఈనే నిర్ణయించినట్టు ఇరిగేషన్ శాఖ వర్గాల్లో చర్చించుకుంటున్నారు. కరీంనగర్ సర్కిల్లోని ఓ డివిజన్‌కు పంపేందుకు రంగం సిద్ధం చేశారని, ఉత్వర్వులు వెలువడటమే తరువాయిని సమాచారం. మొత్తంగా ఇరిగేషన్ శాఖలో సదరు డీఈఈ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ఉన్నతాధికారులు సైతం సదరు డీఈఈకే వత్తాసు పలుకుతూ, సీనియర్లను పక్కనపెట్టడంపై ఇంజినీర్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి దీనిపై దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.