ఏటూరునాగారం, సెప్టెంబర్ 25: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి చిరుతపులి చర్మాన్ని తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు, అటవీ శాఖ అధికారులు పట్టుకున్నట్టు ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం స్థానిక ఏఎస్పీ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు.
వెంకటాపురం సీఐ బండారి కుమార్, పేరూరు ఎస్సై కృష్ణప్రసాద్, వాజేడు ఎఫ్ఆర్వో చంద్రమొగిలి సిబ్బందితో కలిసి తాను చండ్రుపట్ల క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై చిరుతపులి చర్మాన్ని తరలిస్తూ పట్టుబడ్డాడు. దానిని పరిశీలించి చిరుతపులి చర్మమేనని ఎఫ్ఆర్వో చంద్రమొగిలి ధ్రువీకరించారు. దీంతో నిందితుడిని ప్రశ్నించగా ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణలో విక్రయించేందుకు వస్తున్నట్టు అంగీకరించాడు. నిందితుడు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాకు చెందిన భూపాలపట్నం తాలుకా ఊళ్లురా గ్రామానికి చెందిన జాడి మహేందర్‌గా గుర్తించినట్టు చెప్పారు. మహేందర్ వద్ద పులి చర్మంతోపాటు మొబైల్ ఫోన్, రిజిస్ట్రేషన్ లేని ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.