రంగారెడ్డి, మే 30 (నమస్తే తెలంగాణ) : పేదలకు ఇవ్వాల్సిన ఇందిరమ్మ ఇండ్లను కాంగ్రెస్ కార్యకర్తలకే కేటాయిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. రామోజీ ఫిలింసిటీలో పట్టాలు పొందిన పేదలందరికీ ఇండ్ల స్థలాలు చూపించాలని, ఫార్మాసిటీ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం సీపీఎం ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కావడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకే కేటాయిస్తున్నారని, ఎంతోమంది పేదలు సొంతింటికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు గత ప్రభుత్వం ఎకరాకు గుంట చొప్పున ఇండ్ల స్థలాలకు పట్టాలిచ్చిందని, వాటికి కాంగ్రెస్ సర్కార్ పొజిషన్ చూపించకపోవడం దారుణమని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడంతో పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.